శ్రీ సత్య సాయి బ్యూరో, మార్చి8 (ప్రభన్యూస్): శంఖారావం సభలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఉదయం శ్రీ సాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో నారా లోకేష్ కు సత్యసాయి ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఇతర ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. నారా లోకేష్ వెంట మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, టిడిపి నాయకులు, ప్రముఖులు ఉన్నారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 1200కుపైగా కేంద్రాల ద్వారా ఆధ్యాత్మి, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నట్టు లోకేశ్‌కు వివరించారు. ఆయా దేశాల నుంచి ఏటా లక్షలాదిమంది భక్తులు ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తూ బాబా అనుగ్రహం పొందుతున్నట్టు చెప్పారు. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని 1500కు పైగా మారుమూల గ్రామాలకు తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు.
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని సత్యసాయి జనరల్ ఆసుపత్రి ద్వారా లక్షలాదిమందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ సత్యసాయిబాబా ద్వారా స్ఫూర్తి పొందిన తాము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో సత్యసాయి సంస్థలు అందించే సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.