కర్నూలు నగర ప్రధమ పౌరుడు ..మేయర్‌కు బీవై రామయ్య పేరు ఓటర్ల జాబితాలో కనుమరుగైంది. దీంతో షాక్ తిన్న మేయర్ బూత్ లెవెల్ స్థాయి అధికారుల నుంచి ఆరా తీయగా ఓటర్ జాబితా నుంచి ఆయన పేరు తొలగించినట్లు తేలింది. కర్నూలు నగరంలోని గణేష్ నగర్‌లో బీవై రామయ్య నివాసం ఉంటున్నారు. తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో మేయర్ బీవై రామయ్య జిల్లా కలెక్టర్ సృజనకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి ఓటు నమోదు చేసుకోవాలని బీవై రామయ్యకు కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది.
.ఇటీవల బూత్ లెవల్‌లో ఓట్లర్ల జాబితా పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో బీవై రామయ్య ఓటు తొలగించి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లను గుర్తించిన ప్రతిపక్షాలు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రతి ఇంటికి వెళ్లిన బూత్ లెవల్ అధికారులు ఓట్ల జాబితాను పరిశీలించారు. దొంగ ఓట్లను తొలగించారు. అయితే ఇందులో భాగంగా స్థానికంగా ఉంటున్న కొందరి ఓట్లను కూడా తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీల మద్దతు దారులకు సంబంధించిన ఓట్లను తొలగించారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో అధికార పార్టీకి చెందిన కర్నూలు మేయర్ ఓటు సైతం తొలగించడంతో బూత్ లెవల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.