Friday, October 18, 2024

AP | భారీ వర్షంలోనూ గుప్త నిధుల వేట !

బత్తలపల్లి, (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లాలో గుప్తనిధుల తవ్వకం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఏకంగా జేసీబీతో గుప్త నిధుల కోసం ఎగబడ్డారు. కానీ వీరు ఎంత ప్రయత్నించినా గుప్త నిధి జాడ దొరకలేదు. ఆ ఊరి జనం దేవుడిగా కొలిచే బండరాయిని జేసీబీతో చెరబట్టిన ఈ దుండగుల అకృత్యం.. జనాల్లో కలవరం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి…

బత్తలపల్లి మండలంలోని అప్పరాచెరువు గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటప చోటు చేసుకుంది. అప్పరాచెరువు గ్రామంలోని చెరువు మరువ కట్ట సమీపాన అపరాధయ్య స్వామిగా కొలిచే పెద్ద బండరాయిని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వేశారు.

తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తుంటే.. జనం ఇళ్లకే పరిమితం కాగా.. దుండగులు తమ పని కానిచ్చేశారు. పోతులయ్య స్వామి గుడి సమీపంలోని అపరాధయ్య స్వామి బండను తొలగించి దాదాపు 20 అడుగుల గుంతను తవ్వారు. అపరాధయ్య స్వామి బండ కింద అమూల్యమైన బంగారు నిధులు ఉన్నట్లు కథనాలు ఉన్నాయి.

గతంలోనూ అనేక సార్లు అపరాధయ్య స్వామి బండను తొలగించడానికి విఫల ప్రయత్నాలు జరిగాయి. ఈ సారి ఏకంగా జేసీబీ సహాయంతో పెద్ద పెద్ద బండరాలను తొలగించారు. గుప్త తవ్వకాల ముందు మాంత్రికులతో క్షుద్రపూజలు నిర్వహించారు. రహదారి వెంబడి మంత్రించిన కొర్రలను చల్లారు.

గత రెండు మూడు రోజుల నుంచి కొత్త వ్యక్తులు కార్లలో సంచరించిన వారే రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది, ఈ విషయం బయటకు పొక్కటంతో శుక్రవారం ఉదయాన్నే గ్రామస్తులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.

- Advertisement -

పోలీసులు ఈ ప్రదేశం సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ పుటేజీల్లో కొత్త వ్యక్తుల సంచారం కనిపించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్సై సోమశేఖర్ ను వివరణ కోరగా గుప్త నిధుల తవ్వకాల ఉదంతం తమ దృష్టికి వచ్చిందని, గ్రామంలో పరిస్థితిని సమీక్షించామని, ఈ కేసును మరింత లోతుగా విచారిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement