Thursday, October 24, 2024

AP | వరద ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే పరిటాల సునీత

  • కనగానపల్లి చెరువుతో సహా తొమ్మిది చెరువులకు గండి
  • భారీగా పంట నష్టం
  • నెలలోపు పూర్తిస్థాయి మరమ్మతులు
  • నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం


శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చెరువులకు గండి పడినట్లు జిల్లా కలెక్టర్ టి ఎస్ చేతన్ తెలిపారు. గురువారం కలెక్టర్ చేతన్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి కనగానపల్లి రెడ్డి వారి కుంట చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఈ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అనేక ప్రాంతాలలో చెరువులకు గండి పడి నీరు వృధాగా పోవడమే కాకుండా, పంటలు నష్టం కూడా భారీగా జరిగిందన్నారు.

వాస్తవానికి రెడ్డి వారి కుంట చెరువు సామర్థ్యం 27 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండగా, భారీ వర్షం కారణంగా సుమారు 30వేల క్యూసెక్కుల పైబడి నీరు రావడంతో చెరువు కట్ట కోతకు గురైంది. ఫలితంగా గండిపడి నీరంతా దిగువ ప్రాంతానికి వెళ్ళింది. ముఖ్యంగా అనంతపురం సమీపంలోని పండమేరు ద్వారా అనంతపురం శివారు ప్రాంతాన్ని ముంచిన‌ విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే మొత్తం నీరు పండమేరుకు వెళ్లకుండా మధ్యలో డైవర్ట్ కావడం వలన ప్రమాదం చాలా వరకు తగ్గిందన్నారు. ఇదిలా ఉండగా నెలలోపు చెరువుల మరమ్మతులను చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన నిధుల కోసం నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇదే సందర్భంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన నష్టం, రోడ్ల మరమ్మతులకు నివేదికలు తయారు చేయాలని ఆదేశించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement