యల్లనూరు, (ప్రభ న్యూస్): యల్లనూరు మండల పరిధిలోని బొప్పేపల్లి గ్రామంలో సోమవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మండల పరిధిలోని బొప్పేపల్లి గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి ఆదివారం బోనాలు సమర్పించుటలో కురుబ నారాయణ స్వామి వర్గానికి చెందిన వారు బోయ ఓబులేసు వర్గానికి చెందిన వారి
ఇరువురి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ముందు మేము అమ్మవారికి బోనాలు సమర్పించాలని ఒక వర్గం, మరొక వర్గం మేము ముందు అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. వారి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా కూచివారిపల్లి గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా బందోబస్త్ లో ఉన్న గ్రామ పోలీస్ విషయం తెలుసుకొని సంఘటన
స్థలానికి చేరుకొన్నారు.
అక్కడ ఘర్షణకు గల కారణాలపై ఆరా తీసి ఇరువురిని పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి రావడం జరిగింది. ఆదివారం సాయంత్రం ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ లో పోలీసులు ఎస్ఐ లేరని ఉదయం రమ్మని చెప్పి పంపించారు. అంతలోనే స్వల్ప ఘర్షణ కాస్త ఇరు వర్గాల మధ్య కర్రలు రాళ్లు రువ్వు కొనే వరకు వెళ్ళింది. రాళ్ల దాడిలో బాల శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షత గాత్రున్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు అనంతపురం జిల్లాకు తీసుకొని వెళ్లాలని సూచించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటన పై ఇరు వర్గాల వారి పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.