అనంతపురం పోలీసులు సమన్వయంతో ఒక యువకుడి ప్రాణాలు కాపాడారు. కాసేపట్లో రైలు వస్తే ఆ యువకుడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ యువకుడిని రక్షించారు. డయల్ – 100 విభాగం ఇచ్చిన సమాచారం మరియు పోలీసుల సమన్వయం ఇందుకు దోహదం చేసింది. వివరాలు… అనంతపురం జిల్లా నార్పల కు చెందిన సతీష్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఓ స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అతను ఉద్యోగం వదిలేశాడు. ఈక్రమంలో ఈరోజు అనంతపురం మండలం తాటిచెర్ల గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పై అడ్డంగా పడుకొని తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోటోలు చిత్రీకరించి వాట్సాప్ ద్వారా తన మిత్రులకు షేర్ చేశాడు. మిత్రులు అప్రమత్తమై డయల్-100 కు ఫోన్ చేయడమే కాకుండా ఆ ఫోటోలను పంపారు. డయల్ – 100 సి.ఐ దేవానంద్ వెంటనే అప్రమత్తమై అనంతపురం రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డికి ఈ సమాచారం చేరవేశారు. ఒకవైపు ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడితో ఫోన్లో మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేస్తూనే… మరోవైపు అనంతపురం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సదరు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి యువకుడిని కాపాడారు. సతీష్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. మరికొన్ని క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉన్న యువకుడిని చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి కాపాడిన డయల్ – 100 సీఐ దేవానంద్ , ఎస్.ఐలను ,అనంతపురం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి, ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement