Friday, November 22, 2024

మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చూడండి …జిల్లా కలెక్టర్

అనంతపురం : మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం రవాణా అరికట్టేందుకు నిఘా పెట్టాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలకు సమాచారం అందజేసి, వారు ఓటింగ్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వలస కూలీలను తిరిగి రప్పించి, ఓటుపై ప్రతి ఒక్కరిపై అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచాలన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యార్థులకు ఓటు ప్రాధాన్యంపై తెలియజేసి వారి తల్లిదండ్రులు మరియు చుట్టుపక్కల వారికి ఓటు వేయాలని విద్యార్థులు తెలియజెప్పేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని, మున్సిపల్ ఎన్నికలను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను, రిసెప్షన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి భోజన సదుపాయం కల్పించాలని, సిబ్బంది వద్దకే భోజనాన్ని అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలని, సరిపడేంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, డిఎస్పీ రమ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడు, తహసీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ కొండన్న, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement