Friday, November 22, 2024

తాడిప‌త్రి చైర్మ‌న్ గా జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి, వైస్ చైర్ ప‌ర్స‌న్ గా స‌ర‌స్వ‌తి….

తాడిప‌త్రి – ఎత్తులు, పై ఎత్తుల మ‌ధ్య ఉత్కంఠ క‌లిగించిన తాడిప‌త్రి మునిసిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవ‌సం చేసుకుంది.. ఆ పార్టీకి చెందిన జెసి ప్ర‌భాక‌ర రెడ్డి చైర్మ‌న్ గా, డిప్యూటీ ఛైర్ ప‌ర్స‌న్ గా స‌ర‌స్వ‌తిలు ఎన్నిక‌య్యారు. గురువారం ఉదయం స్థానిక మునిసిపల్ సమావేశ మందిరం లో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎంపిక నిర్వహించారు తాడిపత్రి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జి. ఆర్ .మధుసూదన్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.ఈ వోటింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హర్షవర్ధన్,జె సి(అభివృద్ధి) డా.ఏ.సిరి లు ఆసాంతం పర్యవేక్షించారు. ఎక్స్ ఆఫీసీయో సభ్యులుగా వై సి పి కి చెందిన తాడిపత్రి ఎం ఎల్ ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి,అనంతపురం ఎంపీ తలారి రంగయ్య లు 16 మంది వార్డు సభ్యులతో కలిసి హాజర‌య్యారు. అలాగే టిడిపికి చెందిన వార్డు సభ్యులు18 మంది,సీపీఐ, స్వతంత్ర వార్డు సభ్యులతో కలిసి ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,సిపిఐ పార్టీలకు చెందిన అభ్యర్థులు మరియు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన కౌన్సిలర్లు సమావేశ మందిరంలో వారికి కేటాయించిన సీట్లలో ఆశీనులయ్యారు.
అనంతరం ప్రోసిడింగ్ అధికారి వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయుంచారు. తొలుత చైర్మన్ ,వైస్ చైర్మన్ ల ఎంపిక సంబంధించిన ప్రక్రియను గూర్చి ప్రిసైడింగ్ అధికారి సభ్యులకు వివరించారు. అనంతరం ఓటింగ్ ను ప్రారంభించారు. వై ఎస్ ఆర్ సి పి తరఫున ఫయాజ్ భాషను చైర్ పర్సన్ అభ్యర్థిగా గా కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 31వ వార్డు మెంబరు ప్రతిపాదించారు. 19 వ వార్డు మెంబరు ఏసీ నాగిరెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.జేసీ ప్రభాకర్ రెడ్డి ని టిడిపి తరఫున (24 వ వార్డు మెంబర్ ను) చైర్పర్సన్ అభ్యర్థిగా 16 వార్డు మెంబరు వి సురేష్ ప్రతిపాదించారు. 33 వ వార్డు మెంబర్ విజయకుమార్ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు .రెండవ వార్డ్ మెంబర్ ఫయాజ్ భాష ను వైసీపీ తరఫున ,24వ వార్డ్ మెంబర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మెన్ అభ్యర్థులుగా ఓటింగ్ నిర్వహించారు . ఛైర్ పర్సన్ కోసం ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ ఆఫీసీయో సభ్యుల ఓట్లతో కలుపుకుని18 ఓట్లు ఫయాజ్ భాష కు రాగా , జేసీ ప్రభాకర్ రెడ్డి కి 20 ఓట్లు లభించింది. పోటీలో ఎక్కువ ఓటింగ్ సాధించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎంపిక అయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు . వై ఎస్ ఆర్ సి పి తరఫున పి.రూప ను వైస్ చైర్ పర్సన్ అభ్యర్థిగా వార్డు మెంబరు జయప్రద ప్రతిపాదించారు. కరుణశ్రీ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. టిడిపి తరఫున 9 వ వార్డు మెంబర్ పి.సరస్వతి ని వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా 26 వ వార్డు మెంబరు షేక్ షావలి ప్రతిపాదించారు. 6 వ వార్డు మెంబర్ రాబర్ట్ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు . పి.రూప ను వైసీపీ తరఫున ,పి.సరస్వతి ని టి డి పి తరపున వైస్ చైర్మెన్ అభ్యర్థులుగా ఓటింగ్ నిర్వహించారు .వైస్ ఛైర్ పర్సన్ కోసం ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ ఆఫీసీయో సభ్యుల ఓట్లతో కలుపుకుని18 ఓట్లు పి.రూప కు రాగా , పి.సరస్వతి కి 20 ఓట్లు లభించింది. పోటీలో ఎక్కువ ఓటింగ్ సాధించిన పి.సరస్వతిని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఎంపిక అయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు . వోటింగ్ ప్రక్రియ ఆసాంతం ప్రశాంతంగా సాగింది. ఈ వోటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాడిపత్రి డిఎస్పీ చైతన్య, అనంతపురము డిఎస్పీ వీర రాఘవరెడ్డి ల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి మునిసిపల్ కమీషనర్ పి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఇది ఇలా ఉంటే ఎపిలో ఉన్న మొత్తం 75 మునిసిపాలిటీల‌లో తెలుగుదేశం కైవ‌సం చేసుకున్న ఏకైక మునిసిపాలిటీ తాడిప‌త్రి కావ‌డం విశేషం.. చివ‌ర‌కు టిడిపి అధిక సీట్లు సాధించిన క‌డ‌ప జిల్లా మైదుకూరు మునిసిపాలిటీని సైతం అనూహ్యంగా వైసిపి చేజిక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement