ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆనందయ్య తయారు చేసిన నాటు మందుపై విజయవాడ, తిరుపతి ఆయుర్వేద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు మందు తీసుకున్న వ్యక్తులకు సంబందించిన డేటాను పరిశీలిస్తున్నారు. మరోవైపు జంతువులపై ఈ మందును ట్రయల్స్ ను నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తిరుపతిలోని మంగాపురం వద్ద ఉన్న యానిమల్ ల్యాబ్‌లో జంతువులపై పరిశోధన చేయనున్నారు.
ఆనందయ్య మందును ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి నివేదికను ఇవ్వనున్నారు. ప్రయోగాలకు 14 రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆనందయ్య మందు తీసుకొన్న 500 మంది నుండి సమాచార సేకరణలో వైద్య సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఐదు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. ఈ మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ బృందం ఆరా తీస్తోంది. ప్పటికే సుమారు 70 నుండి 80 వేల మంది ఈ మందును ఉపయోగించినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో కనీసం 500 మంది నుండి డేటా సేకరించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమాచార సేకరణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విజయవాడ, తిరుపతి ఆయుర్వేద వైద్య కాలేజీలకు చెందిన వైద్య బృందం ఈ డేటా సేకరణలో ఉన్నారు. అయితే ఆనందయ్య వద్ద ఇచ్చిన సమాచారం ఆధారంగా వైద్యులు తీసుకొన్న ఫోన్ నెంబర్ల నుండి కచ్చితమైన సమాచారం రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. మరికొందరు ఫోన్లకు స్పందించడం లేదని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బృందం సభ్యులు తెలిపారు.
తిరుపతి ఆయుర్వేద కాలేజీ బృందానికి 250 మంది ఫోన్ నెంబర్లు అందాయి. అయితే వీరిలో సుమారు 70 మంది వివరాలు తెలియరాలేదు. దీంతో మరో 60 మంది జాబితాను సేకరించిన వైద్యుల బృందం ఈ విషయమై ఆరా తీస్తున్నారు. కరోనా వచ్చిన రోగులు ఈ మందు వాడిన తర్వాత ఎలా ఉన్నారనే విషయమై వైద్యులు డేటా సేకరిస్తున్నారు. తొలి దశ పరిశోధనలు పూర్తైతేనే జంతువులపై ప్రయోగంతో పాటు ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
మరోవైపు ఈ పరిశోధనలకు సంబంధించిన నివేదిక 14 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తుడా చైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. నాలుగు దశల్లో ట్రయల్స్ నిర్వహించిన అనంతరం ప్రభుత్వ నివేదిక ఆధారంగా మందుని సరఫరా చేస్తామని చెవిరెడ్డి చెప్పారు. ఆనందయ్య ఔషధంపై పరిశోధన జరుగుతోందని నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో ఔషధం తయారు చేస్తామని చెవిరెడ్డి వెల్లడించారు. తిరుపతిలోనే ఔషధ పరిశోధనకు ల్యాబ్ ఉందని, ఆనందయ్య తయారు చేసిన మందును అక్కిడికే పంపుతున్నామన్నారు. ఆనందయ్య మందుకు ఆమోదం లభిస్తే లక్షల మందికి అందిస్తామని తెలిపారు
కాగా, ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఆనందయ్య నాటు మందు ముందర తేలిపోతోందని ప్రజలు అంటున్నారు. ఆనందయ్య నాటు మందుపై ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. వేల సంఖ్యలో జనం ఈ మందు కోసం ఎగబడుతున్నారు. సోషల్ మీడియాలో ఆనందయ్య నాటు మందు గురించిన పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదికలు వచ్చే వరకు ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది.