ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ కు విరుగుడు మందు నెల్లూరుకు చెందిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య వద్ద ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. దీంతో ఆయనకు నెల్లూరు జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
తాజాగా ఒమిక్రాన్ కు మందు విషయంపై ఆనందయ్య స్పందించారు. తాను ఒమిక్రాన్ కు మందు అని చెప్పలేదని తెలిపారు. ఒమిక్రాన్, కరోనా ఏ వైరస్ అయినా నయం చేసే లక్షణం తన మందులో ఉందని చెప్పానని తెలిపారు. జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చింది వాస్తవమేని తెలిపారు. జేసీ నోటీసులపై త్వరలో వివరణ ఇస్తానని చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదన్నారు. గతంలో అడగలేదు, ఇకపై కోరేది లేదని ఆనందయ్య స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలో మందు పంపిణీకి వ్యవతిరేకంగా తీర్మానం ఎందుకు చేశారో తెలియదన్నారు. తన మందు తీసుకున్న వారిలో చాలా మందికి కరోనా నయమైందని చెప్పారు.
మరోవైపు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుతో ఫేమస్ అయ్యారు. ఒమిక్రాన్ నివారణకు ఆనందయ్య సిద్ధం చేసిన మందుపై రగడ కొనసాగుతోంది. ఆ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆనందయ్యకు నోటీసులు జారీ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్. ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు అని వచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని కోరారు. మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తెలపాలని ఆదేశించారు. అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. ఆనందయ్య ఇంటి ముందు స్థానికులు ధర్నాకు దిగారు. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టినట్లు అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital