Wednesday, November 20, 2024

రహస్యంగా ఆనందయ్య మందు తయారీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆనందయ్య నాటు మందు కరోనా బాధితులు ఆసక్తిగా ఎరురు చూస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ నిలిపివేశారు. అయితే, రహస్యంగా ఆనందయ్య మందును కొందరు తయారు చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని ఓ క్యాటరింగ్ లో అర్ధరాత్రి ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారు. ఎవ్వరికీ తెలీకుండా మందు తయారు చేసి అధికారులకు, నాయకులకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోర్టులో తయారు చేస్తున్న మందు ఎవరికి పంపిణీ చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. రహస్య తయారీపై జనసేన రాష్ట్ర నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. పేదలకు మందు లేకుండా వైసీపీ నేతలు రహస్యంగా మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణాపట్నం పోర్టు, నగరంలోని ఓ క్యాటరింగ్ లో రహస్యంగా మందు తయారీ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందిచాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుపై వెంటనే ప్రభుత్వ అనుమతులు తీసుకుని మందు ప్రజలకు పంపిణీ చేయాలని కోరారు.

మరోవైపు ఆనందయ్య కరోనా మందుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. శాస్త్రీయ అధ్యయనం జరగాలని భావించిన ఏపీ ప్రభుత్వం మందును అధ్యయనం చేయాలని ఆయుష్, ఐసీఎంఆర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆనందయ్య ఆయుర్వేద మందును పరిశీలించిన ఆయుష్ బృందం.. మందు తయారీ విధానంలో వినియోగించిన పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని తెలిపింది. తయారీ పదార్థాలపై ల్యాబ్ రిపోర్ట్ పాజిటివ్‌గానే వచ్చినట్లు ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కూడా కాదని తెలిపారు. ఈ మందు కోసం వాడే పదార్థాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేనని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. ఐసీఎంఆర్ కూడా మందుపై అధ్యయనం చేస్తోంది. మందుపై అధ్యయనానికి సుమారు వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మందుపై శాస్త్రీయ అధ్యయనం పూర్తయి.. నివేదిక వచ్చే వరకూ పంపిణీకి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకూ బాధితులెవరూ కృష్ణపట్నం రావొద్దని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement