— ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి అమర్నాథ్
— భారీగా తరలిరానున్న పార్టీ శ్రేణులు, ప్రజలు
— ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
విశాఖపట్నం ఆంధ్రప్రభ బ్యూరో, నవంబర్ 7: రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ప్రారంభమైన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన వివిధ సభలకు ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఈ నెల 9వ తేదీతో తొలి విడత బస్సుయాత్ర కార్యక్రమం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తొమ్మిదవ తేదీన అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ జరగబోతోంది. ఇప్పటివరకు జరిగిన సభలన్నిటికన్నా అనకాపల్లి సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభం కానున్న ఈ సభా కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులు తరలిరానున్నారు.
ఈ సభకు వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తో సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. ఈ సభకు పరిశీలకులుగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇప్పటికే అనకాపల్లికి చేరుకున్నారు. ఆయన మంత్రి అమర్నాథ్ తో కలిసి స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశమై అనకాపల్లి అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులకు సభ నిర్వహణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను వీరు మంగళవారం పరిశీలించారు. సభకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని మంత్రి అమర్నాథ్ కోరారు. అలాగే సభకు హాజరవుతున్న ముఖ్య నేతలకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 9వ తేదీన అనకాపల్లిలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్ర సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలను ప్రజలకు తెలియచెప్పడంతోపాటు, వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధులను చేసేందుకు ఈ బస్సు యాత్ర ఎంతగానో ఉపకరిస్తుందని అమర్నాథ్ అన్నారు.