టిడిపి నేత ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద టెన్షన్
సీటు ఇవ్వాలంటూ పురుగుల మందు తాగిన
ఇద్దరు కార్యకర్తలు .. వారి పరిస్థితి విషమం
వందలాదిగా ప్రభాకర్ చౌదరి నివాసానికి చేరుకున్న కార్యకర్తలు
అనంతపురం, మార్చి 30 (ప్రభ న్యూస్ బ్యూరో) : అనంతపురం మాజీ శాసనసభ్యులు అర్బన్ ఇంచార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గం లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. వందలాదిగా కార్యకర్తలు నాయకులు ప్రభాకర్ చౌదరి నివాసానికి రెండో రోజు కూడా చేరుకుని ఆందోళనలు చేపట్టారు.. తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించలేదనే తీవ్ర మనస్తాపంతో భార్య భర్తలు నాగరాజు, మమత అక్కడే పరుగులు మందు తాగారు.. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.
మరోవైపు రుద్రంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ సూపర్ సిక్స్ క్యాలెండరు జెండాలను రోడ్డుపై పడేసి అంటించారు. అలాగే నారా లోకేష్ ఫ్లెక్సీలను కటౌట్లను ధ్వంసం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే టికెట్ ప్రభాకర్ చౌదరి కి కేటాయించేంతవరకు నిరసనలు తెలియచేస్తూనే ఉంటామని పార్టీ నాయకులు కార్యకర్తలు పేర్కొంటున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో పరామర్శ…
టిక్కెట్టు కేటాయించక పోవడంతో పురుగుల మందు తాగిన సతీష్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం వైకుంఠం ప్రభాకర్ చౌదరి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం అందించడానికి వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.