పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుండి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలి
ఉమ్మడి జిల్లాలోని చెరువులను నింపేలా కార్యాచరణ చేపట్టాలి
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి
కర్నూలు బ్యూరో : భారీ వరద శ్రీశైలం రిజర్వాయర్ కు వస్తుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం 854 అడుగులు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుండి నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం సమితి కార్యాలయంలో మాట్లాడుతూ… తుంగభద్ర, కృష్ణా నదుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తుండడంతో రాయలసీమ రైతాంగం ఆనందంగా వున్నారన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుండి రాయలసీమలోని రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చెరువులకు నీటి విడుదల ఎలాంటి జాప్యం లేకుండా చెరువులు నింపేలాగా కార్యాచరణ చేపట్టాలని బొజ్జా కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా, కడప జిల్లాలకు సంబంధించిన కేసీ కెనాల్, ఎస్ఆర్ బీసీ, తెలుగు గంగ, హంద్రీ నీవా ప్రాజెక్టుల సాగునీటి విడుదలపై సాగునీటి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని బొజ్జా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, సౌదాగర్ ఖాసీం మియా, భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్, మహమ్మద్ పర్వేజ్, మనోజ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.