- బ్లేడ్, గంజాయి బ్యాచీలపై నిఘా
- హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్టు
- పరారీలో ఉన్న వారి కోసం గాలింపు
- వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పై ఉన్న కేసులపై పునర్విచారణ
ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ బ్యూరో : అరాచక శక్తులపై ఉక్కు పాదం మోపుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. ప్రధానంగా బ్లేడు, గంజాయి బ్యాచీలపై గట్టి నిఘా వేశామన్నారు. గురువారం విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
సత్యనారాయణపురంలోని స్థల కబ్జాకు సంబంధించి యజమానిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల వివరాలను కమిషనర్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామన్నారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారని చెప్పారు. ప్రధాన నిందితుడు అనిల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారని తెలిపారు.
హత్యాయత్నానికి కారణాలు ఇవే…
సత్యనారాయణపురంలో సుమారు ఐదు కోట్ల విలువైన స్థలాన్ని స్థానిక వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించాడని కమిషనర్ చెప్పారు. నగరానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు జి ఉమామహేశ్వరరావు లక్ష్మీనగర్ లో 325 గజాల స్థలం ఉందని, ఆయన మరణానంతరం ఆస్తి పంపకాలలో భార్యకు కుమారులకు సంక్రమించిందని తెలిపారు. ప్రస్తుతం విజయలక్ష్మి పేరు మీద ఉన్న స్థలంపై గౌతమ్ రెడ్డి తనకున్న అధికార బలంతో కబ్జా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.
ఇదే క్రమంలో స్థల యజమాని పలుమార్లు స్థానిక మీడియాతో పాటు, సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై పోస్టులు పెట్టడంతో రగిలిపోయిన గౌతమ్ రెడ్డి స్థల యజమాని హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ నెల ఆరవ తేదీ మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు ఇంట్లోకి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు స్థల యజమాని ఫిర్యాదు చేశాడు. తాను గట్టిగా అరిచేటప్పటికీ వెళ్ళిపోతూ తన ఇంటి దస్తావేజులు సెల్ఫోన్ పర్సు తీసుకుపోయారని ఆరోపించారు. దీనిపై విచారించిన పోలీసులు గౌతమ్ రెడ్డి అతని డ్రైవర్ బండ శ్రీను కలిసి ముందస్తు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ద్వారా నిందితుల వాడిన వాహనాలను గుర్తించిన పోలీసులు జగ్గయ్యపేటకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు.
వైసీపీ నేత గౌతంరెడ్డిపై ఉన్న కేసుల పునర్విచారణ
వైసీపీ కి చెందిన గౌతంరెడ్డి అనే వ్యక్తిపై 2019లో దాడి కేసు నమోదైందని కమిషనర్ తెలిపారు. గౌతమ్ రెడ్డిపై హత్య కేసులతో పాటు దాదాపు 43 కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. గౌతమ్ రెడ్డిపై రౌడీషీట్ నమోదైందని, అయితే అది ఎందుకు క్లోజ్ చేశారో పరిశీలిస్తున్నామన్నారు. గౌతమ్ రెడ్డిపై నమోదైన కేసులన్నింటిపై విచారణ చేస్తామని ప్రకటించారు. స్థలం విషయంలో నకిలీ దస్త్రాలతో మోసగించినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఉమామహేశ్వర శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా బ్లేడ్ గంజాయి బ్యాచీలపై గట్టిగా నిఘా వేశామని తెలిపారు.