Friday, November 22, 2024

AP: చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ… ఎంపీ రామ్మోహన్

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆక్షేపించారు. రాజ్యాంగ హక్కులు, విలువలను తుంగలో తొక్కి, అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… శుక్రవారం అర్ధరాత్రి నుంచి సినిమాను తలపించే విధంగా ప్రభుత్వం హైడ్రామా నడిపిందన్నారు. అసలు ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా, ఎటువంటి ఆధారాలు చూపకుండా ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. ఇందులో ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు మినహా, ఏ విధమైన వాస్తవం లేదన్నారు.

అక్రమ చర్యలపై నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేకుండా నిర్బంధనలు, అరెస్టులు చేయడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని దుయ్యబట్టారు. దీనిపై కలుగజేసుకోవాలని కోరుతూ… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లకు లేఖ రాసినట్లు వివరించారు. అలాగే చంద్రబాబుకి ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement