అమరావతి, ఆంధ్రప్రభ : అమూల్ అవుట్‌లెట్స్ రాబోతున్నాయి. స్థానికంగా పాల సేకరణ ప్రారంభమైన నేపథ్యంలో పాలు, పెరుగు వంటి ఉత్పత్తులను ఇటీ-వలే మార్కెట్లోకి తీసుకొచ్చిన అమూల్ సంస్థ.. త్వరలో రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. తొలి దశలో ప్రధాన నగరాల్లో, ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న పాల డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు 2020 డిసెంబర్ నుంచి ఆ సంస్థ జగనన్న పాల వెల్లువ కింద పాల సేకరణకు శ్రీకారం చుట్టింది. అనతి కాలంలోనే పాడి రైతుల మన్ననలు అందుకున్న ఈ సంస్థ ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో రోజుకు సగటున లక్ష లీటర్ల చొప్పున పాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 2.18 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రైతులకు రూ.104.89 కోట్లు చెల్లించింది. దశల వారీగా 50-60 శాతం గ్రామాలకు విస్తరించడం ద్వారా రానున్న ఐదేళ్లలో రోజుకు 10 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంతో ముందుకెళ్తోంది. త్వరలో పాల సేకరణ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖలో ట్రయిల్ రన్ నిర్వహిస్తోంది. ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సేకరించిన పాలను ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాల్లోని తమ ప్లాంట్లకు తీసుకెళ్లి ప్రాసెస్ చేసి మార్కెలోకి తీసుకొస్తోంది. ఇక నుంచి స్థానికంగానే ప్రాసెస్ చేసేందుకు వీలుగా ప్రధాన నగరాల్లో ప్లాంట్ల ఏర్పాటు-కు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇటీ-వల విశాఖ, నూజివీడులో ప్రైవేట్ డెయిరీలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు పాలతో పాటు- బాలామృతాన్ని సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రతి నగరంలో వంద అవుట్‌లెట్స్..
ప్రైవేట్ డెయిరీలకు దీటుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయాలని అమూల్ సంకల్పించింది. ప్రతి నగరంలో కనీసం వంద అవుట్ లట్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో విజయవాడ, విశాఖ, గుంటూరు, రాజమండ్రి నగరాల్లో ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ఆయా నగరాల్లో సర్వే చేసి, ఎంపిక చేసిన అనువైన స్థలాల కేటాయింపు కోసం స్థానిక సంస్థలకు ప్రతిపాదనలు సమర్పించింది. విజయవాడలో ఇప్పటికే 44 అవుట్ లెట్స్ కోసం గుర్తించిన స్థలాల కేటాయింపు విషయమై స్థానిక నగరపాలక సంస్థ పరిశీలిస్తోంది. స్థానిక సంస్థలకు ఆదాయం వచ్చేలా లీజు పద్దతిన కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో 10 / 10 అడుగుల విస్తీర్ణంలో కంటైనర్ తరహాలో ఈ పార్లర్లు ఏర్పాటు చేయబోతుంది. కార్పొరేట్ స్థాయిలో వీటిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సొంత ఆర్థిక వనరులతో ముందుకొచ్చే యువతకు వీటిని కేటాయించనుంది. ఒక్కో అవుట్ లెట్‌లో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల విలువైన పరికరాలు సమకూర్చనున్నది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డెయిరీలు తయారుచేసే ఉత్పత్తులకు భిన్నంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తయారైన నాణ్యమైన పాల ఉత్పత్తులను ఈ అవుట్‌లెట్స్ ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది. వీటి ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనావేస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..