Tuesday, November 26, 2024

అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలి : రాజీవ్ గౌబ‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా, జల్‌ జీవన్‌ మిషన్‌, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సీఎస్‌లకు సూచించారు. త్వరలో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢిల్లీ నుండి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన అంశాలపై సిఎస్‌ లతో గౌబ సమీక్షించారు. అనంతరం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా 75 రోజులపాటు నిర్వహించే కోవిడ్‌ ప్రికాషన్‌ డోస్‌ పంపిణీ కార్యక్రమంపై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలు చేసి 18ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇందుకు గాను గ్రామ పంచాయితీలు, మున్సిపల్‌ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని రాజీవ్‌ గౌబ సిఎస్‌ లకు చెప్పారు. అంతేగాక ప్రభుత్వ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ద్వారా వ్యాక్సిన్‌ అందించాలని, రైల్వే స్టేషన్లు,బస్సు స్టేషన్లు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు- చేసి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వ్యాక్సిన్‌ అందించే సమయంలో అన్ని పాఠశాలలు,కళాశాలు,విశ్వవిద్యాలయాలు వంటి అన్ని విద్యా సంస్థలు తెరచి ఉంచేలా చూడాలని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలక్టర్లు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సిఎస్‌ లను కేబినెట్‌ కార్యదర్శి రాజీవ గౌబ ఆదేశించారు. అలాగే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా ఆగస్టు 11 నుండి 17 వరకూ దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా (ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపరాడాలి) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆగస్టు 6న ఢిల్లీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన అమలు కమిటీ సమావేశం జరగనుందని తెలిపారు. అంతకు ముందు జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలపై మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నిరంతరం స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టి ఈకార్యక్రమాన్నివిజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని రాజీవ్‌ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ మాట్లాడుతూ జల్‌ జీవన్‌ మిషన్‌ కు సంబంధించి రూ.1000 కోట్ల డిపిఆర్లు సిద్ధం చేసి అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చామని ఈనెలలో ఆనిధులు కూడా విడుదల చేస్తామని కేబినెట్‌ కార్యదర్శికి వివరించారు. ఈపధకం కింద 90 లక్షల 60 వేల గృహాలకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే 39 లక్షల ట్యాప్‌ లు ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రగతిలో ఉండగా మరో 30 లక్షలకు చెందినవి -టె-ండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర వాటాలకు అనుగుణంగా బిల్లులు వచ్చిన వెంటనే తగిన నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా ఆగస్టు 11 నుండి 17 వరకూ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరనమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ కేబినెట్‌ కార్యదర్శికి వివరించారు. రాష్ట్రంలో 90 లక్షల మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు, మరో 24 లక్షల మంది పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో ఈకార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామ పంచాయితీలు, వైద్య ఆరోగ్య సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలలు, వివిధ ప్రభుత్వ ప్రవేట్‌ సంస్థలను దీనిలో పెద్దఎత్తున భాగస్వాములను చేసి హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్రికి అవసరమైన మువ్వన్నెల జెండాల అంచనా వివరాలను రెండు మూడు రోజుల్లో తెలియజేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబకు వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement