అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతి భూములను ఏపీ ప్రభుత్వం అమ్మకానికి నిలిపింది. ఇందుకు సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) కసరత్తు జరుపుతోంది. రాజధాని అభివృద్ధికి గడువు విధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అందుకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా భూ సమీకరణ కింద రైతులు ఇచ్చిన భూముల్ని వేలం వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం కరకట్ట విస్తరణతో పాటు పేజ్-1లో బ్యాంకర్ల కన్సార్టియం ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులకు సంబంధించిన నివాస భవనాలను పూర్తి చేస్తోంది. అయితే ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటంతో అమరావతి ప్రాంతంలో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కన్సార్టియం ముందుకు రావటం లేదు.. దీంతో రాజధాని ప్రాంత పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ”మిషన్ బిల్డ్ ఏపీ”లో భాగంగా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఏపీ రాజధాని నిర్మాణ నిమిత్తం రైతుల నుంచి గత ప్రభుత్వం 33వేల 500 ఎకరాల భూములను సమీకరించింది. దీంతో పాటు అటవీ, దేవాదాయశాఖ, ఇతర అసైన్డ్ , ప్రభుత్వ భూములతో కలుపుకుని సుమారు 50 వేల ఎకరాలు అందుబాటులో ఉంది. వీటిలో వివిధ సంస్థలకు సుమారు 10వేల ఎకరాల వరకు కేటాయింపులు జరిగాయి. పిచ్చుకలపాలెంలో వైద్య పరికరాల తయారీ సంస్థ బీఆర్ షెట్టి, లండన్ కింగ్స్ కాలేజీలకు 248 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఆ భూములు వినియోగించక పోవటంతో వాటిని ఎకరం రూ.10 కోట్ల చొప్పున విక్రయించాలని భావిస్తోంది. అనంతరం ఏడాదికి 50 ఎకరాల చొప్పున మరో 600 ఎకరాలు అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవల జరిగిన పురపాలకశాఖ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే జీవో 389 విడుదల చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ జీవో అందుబాటులో లేదు. జీవోల విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తున్నందున వెబ్‌సైట్‌లో పొందుపరచలేదని చెప్తున్నారు. సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో కూడా జీవోను నిక్షిప్తం చేయలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.