అమరావతి, ఆంధ్రప్రభ : డీఓపీటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. బుధవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలితో సహా… రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్ లను రిలీవ్ చేసింది. వీరు రాష్ట్ర సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు రిపోర్టు చేసేశారు.
అయితే, ఏపీ ప్రభుత్వంలో ఆమ్రపాలికి దక్కే పోస్టుపైన అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలిని నియమించనున్నట్లు తెలుస్తోంది. గురువారం లేదా శుక్రవారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం అందుతోంది.
ఇదిలా ఉండగా, ఏపీ నుంచి రిలీవ్ అయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇప్పటికే తెలంగాణా సీఎస్‌కు రిపోర్ట్ చేశారు. అయితే, ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై నవంబర్‌లో విచారణ కొనసాగనుంది. వారి అభ్యంతరాలపై తుది ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఏపీ నుంచి రిలీవ్ అయిన అధికారుల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో పాటు శివశంకర్, హరికిరణ్‌లు ఉన్నారు.