అచ్యుతాపురం, (అనకాపల్లి) ప్రభ న్యూస్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్ పరిధిలోని పోరస్ కంపెనీలో అమ్మోనియా వాయువు లీకైంది. సీడ్స్ యూనిట్లో ఒక్కసారిగా ఘాటైన వాయువు బయటకువచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న 140 నుంచి 200 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. లీక్ అయిన వాయువు పీల్చడంతో మహిళలకు కళ్లమంటలు రావడంతో పాటు తల తిరగడం, వాంతులయ్యాయి. వెంటనే బాధితులను యాజమాన్యం హుటాహుటిన సెజ్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఎస్‌ఈజేడ్లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేస్తున్నారు.
అమ్మెనియా పీల్చడంతో మహిళలు స్పృహ తప్పిపోయారని, ప్రాణాపాయం ఉండదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పోరస్ కంపెనీలో అమ్మోనియా లీకేజీని నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. చుట్టు ప్రక్కల ఫార్మా పరిశ్రమలు ఉండటంతో విషవాయువు గాలి విస్తరించిందని స్థానికులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..