తొలిసారి సమర్పించిన వైదిక కమిటీ
ఉత్సవ శోభ సంతరించుకున్న ఇంద్రకీలాద్రి..
(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : ఇంద్రకీలాద్రి సరికొత్త ఉత్సవ శోభను సంతరించుకుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆషాడ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై శనివారం నుండి ఆషాడమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలి సారెను ఆలయ వైదిక కమిటీ సభ్యులు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించిన అనంతరం ఆలయ మహా మండపం ఆరవ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు అనంతరం ప్రత్యేక సారెను సమర్పించారు.
అమ్మవారికి భక్తుల సారే సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేశారు. అలాగే శనివారం నుండి 16వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మొదటిసారి వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఓ కే ఎస్ రామారావు మాట్లాడుతూ… వచ్చే నెల 6 నుంచి నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే నెల 19 తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తునట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై మొట్టమొదటి సారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తునట్లు ప్రకటించారు.
ఈ ఉత్సవాలు జులై 6 నుంచీ 15వరకు జరుగుతాయన్నారు. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రుల్లో జరుపుతామన్నారు. 14న తెలంగాణా మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుందని, మద్యాహ్నం మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారనీ, ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించినట్లు తెలిపారు. 11:45 నుంచి 12:15 వరకూ మహా నివేదన ఉంటుందని, 11:30 నుంచీ 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని ప్రకటించారు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేసినట్లు ప్రకటించారు.