Friday, November 22, 2024

అమ్మ ఒడి – ఆంక్షల ఒడి.. షరతులు పూర్తి చేసిన వారికే పథకం..

కర్నూలు, ప్రభ న్యూస్ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికగా భావించే పథకాల్లో అమ్మఒడి ఒకటి. నవరత్నాల ప్రతిష్టాత్మకమైన పథకంగా జగన్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే ఇప్పుడు ఈ పథకం నిర్వహణలో కొత్తగా కొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ పథకం ద్వారా పాఠశాలకు వెళ్లే విద్యార్థి తల్లి ఖాతాలో ప్రోత్సాహకం కింద ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నారు. ఇందులో రూ.వెయ్యి పాఠశాలల ఆయా జీతాల కోసం మినహాయించి మిగతా రూ.14వేలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అందిస్తానని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత జనవరిలోనే దీని అమలుకు నిర్ణయించారు. 75 శాతం హాజరు ఉంటేనే ఇస్తామని ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలోనే 75 శాతం హాజరు ఉన్నవారికే వచ్చే విద్యా సంవత్సరంలో అమ్మఒడి అందిస్తారు. ప్రస్తుతం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం అమ్మ ఒడి కు సంబంధించిన అర్హతలను పేర్కొన్న విద్యాశాఖ నవంబర్‌ 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం లేకపోయినా ప్రయోజనం పొందలేరని స్పష్టం చేసింది. వాస్తవంగా జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని జూన్‌కువాయిదా వేసిన ప్రభుత్వం ఇప్పుడు సమయం దగ్గర పడుతుండటంతో ఆంక్షల పేరుతో హడావుడి ప్రారంభించింది. ఈ క్రమంలో పన్నెండు రకాల షరతులు పూర్తి చేసిన వారికే పథకం వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో లబ్దిదారుల్లో హైరానా నెలకొంది. 75 శాతం హాజరు, కొత్త బియ్యం కార్డు, కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌ కార్డులో జిల్లాల పేరు మార్చుకోవాలని సూచించింది. కరెంట్‌ బిల్లు 300 యూనిట్లు కన్నా తక్కువ వాడి ఉండాలి, తల్లి, విద్యార్తి ఒకే ఇంట్లో ఉండాలి, విద్యార్థి ఈకేవైసీ, వాలంటీర్‌ దగ్గర వివరాలు చెకింగ్‌, బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులుంచుకోవడం , బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింకు చేసుకోవడం.. ఆధార్‌ నెంబర్‌ ఫోన్‌ నెంబర్‌తో లింక్‌ చేసుకోవడం వంటివన్నీ చేయాలి. బ్యాంక్‌ అకౌంట్‌ రన్నింగ్‌లో ఉండాలని.. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్లయితే ఎన్‌పీసీఐ చేయించుకోవాలని సూచించడం జరిగింది. గవర్నమెంట్‌ ఉద్యోగి, ఇన్కమ్‌ టాక్స్‌ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదనీ స్పష్టం చేశారు. ఒకవేళ తీసుకొని వుంటే వారిపై క్రిమినల్‌ కేసులు పెడతారు. చివరికి కొత్త జిల్లాల వారీగా ఆధార్‌ కార్డు మార్చుకోవాల్సి ఉంది. ఇన్ని షరతులు పూర్తి చేసిన వారికే అమ్మఒడి వస్తుంది. ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా ఆశలు వదులుకోవాల్సిందే.

300 యూనిట్లు వాడితే అమ్మఒడికి ఎసరే..

ఇంట్లో విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మ ఒడి పథకం వారికి వర్తించదు. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు అమ్మ ఒడి వర్తించదు. వాస్తవంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో అమ్మ ఒడి కింద దాదాపు 5.40 లక్షల మంది విద్యార్థులు ఉంటే, గత ఏడాది లక్షన్నర మందికి కోత విధించారు. 3.60 లక్షల మందికి విద్యార్థులకు మాత్రమే అమ్మఒడికి అర్హులుగా గుర్తించారు. అయితే అనర్హులుగా గుర్తించిన ఒకటిన్నర లక్ష తల్లుల్లో.. చాలా వరకు బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం, ఒకవేళ ఉన్నా ఆధార్‌ లింకు లేకపోవడం, విద్యార్థుల అటెండెన్స్‌ తక్కువగా ఉండడం, ఇలా ఎన్నో కారణాలు చూపి తొలగించడం జరిగింది. ఈ క్రమంలో వీటిని పునరుద్ధరించాలని. తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో.. తిరిగి వాటిని సరిచేసుకోవాలని సూచించారు జరిగింది. అన్ని సరి ఉన్నాయి.. ఇక అమ్మఒడి రావడమే ఆలస్యం అంటూ ఎదురు చూస్తున్నా… అమ్మలకు.. తిరిగి ప్రభుత్వం.. 12 ఆంక్షలతో కూడిన జాబితాను విడుదల చేయడం ప్రస్తుతం మింగుడుపడటంలేదు. ప్రభుత్వ తాజా నిబంధనలతో ఈ మారు సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement