Thursday, November 21, 2024

‘అమ్మ ప‌ద్మావ‌తి’.. గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం..

తూర్పు, ప‌శ్చిమ‌ గోదావరి జిల్లాలో టోల్‌ప్లాజాల వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు చోట్ల కూడా ఒకే ట్రావెల్స్‌ నుంచి బయలుదేరిన పద్మావతి ట్రావెల్‌ బస్సులో సుమారు 9 కోట్ల నగదు, 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వ‌ద్ద‌.. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్‌ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. బస్సు సీట్ల కింద ఉన్న లగేజ్‌ క్యారియర్‌ను తెరవగా రూ. 4 కోట్ల 76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నోట్లు నకిలీవా, నిజమైనవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బును విశాఖ పట్టణానికి తరలిస్తున్నట్లు అనుమానం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ వర్మ మీడియాకు తెలిపారు. పట్టుబడ్డ డబ్బులు అనధికార బంగారం కొనుగోలుకు చెందిందని ఆయన వివరించారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యాపారులు కొందరూ ట్యాక్స్‌ లేకుండా బంగారం కొనడానికి డబ్బును గుంటూరు పంపుతున్నారని పేర్కొన్నారు. డబ్బుతో బంగారం కొని తిరిగి అదే బస్సులో బంగారం పంపుతారని తెలిపారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద విజయవాడ నుంచి పలాస వెళ్తున్న మ‌రో పద్మావతి ట్రావెల్స్‌ బస్సులో 5 కోట్లకు పైగా నగదు, 10 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement