Monday, November 25, 2024

America Tour – ఈవి కంపెనీల ప్ర‌తినిధుల‌తో నారా లోకేష్ భేటి

ఆ రంగంంలో పెట్టుబ‌డి పెట్టాల‌ని ఆహ్వానం
ఈవి రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశం
స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల‌కు ప్రాధాన్యం
పెరోట్‌, టెస్లా సంస్థల తో నారా లోకేష్ చ‌ర్చ‌లు
సానుకూలంగా స్పందించిన ఆమెరికా కంపెనీలు

ఆస్టిన్ (యుఎస్ఎ): ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. పెరోట్‌, టెస్లా సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు. నేటి ఉద‌యం పెరోట్‌ గ్రూప్‌ అండ్‌ హిల్‌వుడ్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ రాస్‌ పెరోట్‌ జూనియర్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏవియేషన్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలయెన్స్‌ టెక్సాస్‌ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని ఆయనకు వివరించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనిపై రాస్‌ పెరోట్‌ సానుకూలంగా స్పందించారు.

అనంత‌కు రండి… టెస్లాకు ఆహ్వానం

- Advertisement -

అంత‌కు ముందు ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సిఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ… ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజి పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ షింగిల్స్, డ్రైవింగ్ ఇన్నొవేషన్, మోడల్ -3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధనరంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది 18.8శాతం వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో 97బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు.

అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వాన 2029 నాటికి ఎపిలో 72 గిగావాట్ల రెన్యువబుల్ అఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మా లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ,సహకారాలు అవసరమని అన్నారు. గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు, కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఆయన దృష్టిసారించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా ఈవి తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంది. ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఎపిలో అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాబోయే డేటా సెంటర్, ఐటి హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజి పరిష్కారాలు అవసరం, టెస్లా ఎపికి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్త ఈవి ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం వహించండి. ఆర్ అండ్ డి, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా… ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

మంత్రి వెంట ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement