Saturday, November 23, 2024

సరిహద్దులో అంబులెన్స్ లకు లైన్ క్లియర్

ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులకు తెలంగాణ-ఏపీ రాష్ట్రాల సరిహద్దులో ఆంక్షలు తొలగిపోయాయి. ఈ-పాస్‌ లేకున్నా అంబులెన్స్‌లను తెలంగాణలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపవద్దని ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి పోలీస్‌ శాఖకు ఆదేశాలు అందాయి. దీంతో సరిహద్దు వద్ద పోలీసులు ఆంక్షలను ఎత్తివేశారు.

తెలంగాణ సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణకు వచ్చే అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఈ-పాస్ లేకపోయినప్పటికీ.. సరిహద్దులో అంబులెన్స్‌లను ఆపడం లేదు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు గత మూడు రోజుల నుంచి పాస్‌లు లేని వాహనాలను, అంబులెన్స్‌లను పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అనుమతి లేనిదే రాష్ట్రంలోకి రానివ్వబోమని, హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో బెడ్‌ అందుబాటులో ఉన్నట్లుగా పత్రంతోపాటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ-పాస్‌ ఉంటేనే పంపిస్తామని చెప్పడంతో రోగుల బంధువులు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు తలెత్తాయి.

ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ పోలీసులతో మంతనాలు జరిపినా ఫలితం లేకపోయింది.  ఏపీకి చెందిన పలువురు నేతలు.. తెలంగాణ పోలీసుల తీరును, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం 100కు పైగా అనుమతి లేని అంబులెన్స్‌లను అడ్డుకొని వెనక్కి పంపించారు. అయితే శుక్రవారం(మే14) సాయంత్రం కోర్టు జారీచేసిన ఆదేశాలు అందడంతో.. అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద కూడా ఉదయం నుంచి అమలు చేసిన ఆంక్షలను సడలించారు. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌ను పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి : తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలపై హైకోర్టు స్టే

Advertisement

తాజా వార్తలు

Advertisement