కర్నూల్ బ్యూరో : కర్నూల్ లోని అంబికా శిశు కేంద్రంలో మానసిక వికలాంగులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) జస్టిస్ డాక్టర్ కె.మన్మధరావులు అన్నారు. శనివారం స్థానిక ప్రకాష్ నగర్ లోని అంబికా శిశు కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ డా.కె.మన్మధరావు మాట్లాడుతూ.. మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు వున్నాయని, వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొందవచ్చునని తెలిపారు. మానసిక దివ్యాంగుల సంరక్షణ కోసం స్నేహపూర్వక న్యాయ సేవల పథకం 2005 గురించి వివరిస్తూ… వీరందరికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలిపారు. ట్రస్ట్ వారు చేసే సేవ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సంస్థలో ఒక్కరు కాదు ఇంతమంది మానసిక వికలాంగులకు సేవలు అందిస్తున్న అంబికా శిశు కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని, ఈ సేవలు నిరంతరం ఇదేవిధంగా కొనసాగించాలని కోరారు.
7వ అదనపు జిల్లా జడ్జి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి స్వార్థం లేకుండా, డబ్బు మీద ఆశ లేకుండా సేవలు అందించే సంస్థ అంబికా శిశు కేంద్రమన్నారు. తొలుత మానసిక దివ్యాంగులు తయారు చేసిన బ్యాగ్‌లు, బుక్ బైండింగ్, టైలరింగ్, ప్యాకింగ్, ప్రింటింగ్ మొదలైన నైపుణ్యాలను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలిస్తూ తయారు చేసిన వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్థి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, అదనపు జిల్లా జడ్జీలు జి.భూపాల్ రెడ్డి, పి.పాండురంగ రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా, అంబికా శిశు కేంద్రం ట్రస్ట్ దిలీప్ కుమార్ హెచ్.షా, హేమచంద్ దేవ్‌చంద్ ఛారిటీస్ ట్రస్ట్, వీఆర్పి శైలజా రావు, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.