విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘీభావం పేరిట జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీసీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు సినిమాల్లో కాల్‌షీట్లు లేక 8 గంటల దీక్ష అంటూ ముందుకు వచ్చారని అంబటి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయలేని పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో మిత్రత్వం కొనసాగించాలంటే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని పవన్ కల్యాణ్ బీజేపీకి చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. పోరాట క్రమంలో అందరూ వచ్చి కలుస్తారన్న అంబటి.. అందరూ వస్తేనే పోరాటం చేస్తానని పవన్ చెప్పడం సరైన విధానం కాదన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఇటువంటి పనులు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిపై ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ మాట్లాడే విషయాలకు, చేసే పనులకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఓ కన్ఫ్యూజన్ మాస్టర్ అని అంబటి వ్యాఖ్యానించారు. గతంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆయనను పొగుడుతున్నారని అంటి విమర్శించారు.