పొక్లెయినర్లు.. బుల్డోజర్లతో సీఆర్డీయే దాడి
శ్లాబు దాకా వచ్చిన నిర్మాణాలు ధ్వంసం
నాడు ప్రజావేదిక.. నేడు వైసీపీ కోట విధ్వంసం
ఈ భూమి ప్రజలదే.. 17 ఎకరాల ఇరిగేషన్ ల్యాండ్
తాడేపల్లి ప్రజల తాగునీటి ప్రాజెక్టుకు ప్రతిపాదిత స్థలం
ఇందులో రెండు ఎకరాల్లో పాగా వేసిన వైసీపీ
అనుమతులు నిల్.. అయినా భారీ కట్టడాలు
ఈ భూమి విలువ వందల కోట్లపైనే
వివరణ ఇచ్చిన సీఆర్డీయే అధికారులు
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారన్న వైసీపీ
అదిరేది లేదు, తగ్గేది లేదని జగన్ ట్వీట్
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:
నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీయే అధికారులు శనివారం వేకువఝామునే కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలోని వైసీపీ కార్యాలయాన్ని ఈరోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య పొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డీయే అధికారులు కూల్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి, శ్లాబ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ కట్టడాలను కూల్చే సమయంలో అటు వైపు కార్యకర్తలు, నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్‌డీయే కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్‌డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఈ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.
ఇది అక్రమ నిర్మాణమేనా?
తాడేపల్లిలోని 17 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని రెండు ఎకరాల స్థలంలో అతి పెద్ద పార్టీ కార్యాలయాన్ని వైసీపీ నిర్మిస్తోందని సీఆర్డీయే ఆరోపణ చేస్తోంది. కాంపౌండ్‌లోని ఆర్ఎస్ నెం.202-ఏ-1లోని 870.40 చదరపు మీటర్ల స్థలంలో జరుగుతున్న ఈ అక్రమ కట్టడంపై, ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు. నిబంధనల ప్రకారమే నిర్మాణంలోని కట్టడాన్ని కూల్చేసినట్టు అధికారులు స్పష్టంచేశారు. తాడేపల్లిలోని 17 ఎకరాల ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు తాగునీటి కొరత తీర్చేందుకు 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాగునీటి సరఫరా ప్లాంట్ ఏర్పాటునకు సన్నాహాలు చేసింది. వందల కోట్ల రూపాయల విలువ చేసే విలువైన 17 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తమ పార్టీ కార్యాలయానికి ఆనాటి ప్రభుత్వం రాసి ఇచ్చేసింది. అయితే.. అధికారిక అనుమతులు లేవు. తాడేపల్లి వాసులకు తాగు నీటిని అందించాల్సిన ప్రాంతాన్ని పార్టీ కార్యాలయం కోసం అప్పటి అధినేత కబ్జా చేసారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలో.. ప్రభుత్వం మారడంతో వైసీపీ యత్నానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, వైసీపీ కబ్జా నుంచి ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు.
ప్రజాస్వామిక వాదులు ఖండించాలి.. జగన్ ట్వీట్
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. “ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటనతో ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’’ అని జగన్ ట్వీట్ చేశారు.