Wednesday, November 20, 2024

మరో మహాపాదయాత్రకు అమరావతి రైతుల సన్నాహం.. 60 రోజుల పాటు రైతుల పాదయాత్ర

అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతి రైతులు మరో మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. నవ్యాంధ్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీకి రైతుల ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకోనుంది. ఇప్పటికే న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహాపాదయాత్రను నిర్వహించిన రైతులు, మహిళలు తాజాగా మహాపాదయాత్ర 2.0 సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు, అవాంతరాలు ఎదురవుతున్నా రైతులు, మహిళలు ఉద్యమాన్ని ఏమాత్రం నీరుకారనివ్వకుండా పట్టు వదలని దీక్షతో కొనసాగిస్తూ వస్తున్నారు. రాజధాని పరిసర గ్రామాల్లో నిత్యం నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకవైపు నిరసన దీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు న్యాయపోరాటాన్ని సైతం రైతులు, మహిళలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సైతం రైతులకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుపై ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఇంకా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అమరావతిని అభివృద్ధి చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేసే పనిలో ఉన్నా రైతులు మాత్రం తమ పోరాటాన్ని కొనసాగిస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేసిన రైతులు తమ దీక్షలు కొనసాగిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు భాజపా, జనసేన, వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ రైతుల పోరాటానికి బాసటగా నిలుస్తున్నాయి. అయినా ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఇప్పుడు మరో యాత్ర నిర్వహించి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాన్ని అమరావతి జేఏసీ చేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి 60 రోజుల పాటు మహా పాదయాత్ర 2.0ను నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది.

ఈ షెడ్యూల్‌ను కూడా ప్రకటించి రూట్‌మ్యాప్‌ను జేఏసీ నేతలు విడుదల చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి మహాపాదయాత్ర 2.0 ప్రారంభం కానుంది. గతంలో హైకోర్టు నుంచి తిరుపతి వరకు తొలి పాదయాత్రను నిర్వహించిన రైతులు, మహిళలు ఇప్పుడు ఉత్తరాంధ్రపై ఫోకస్‌ చేశారు. ఈ యాత్రను వెంకటపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 60 రోజుల పాటు సాగే ఈ యాత్ర గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి చేరుకునేందుకు అవసరమైన రూట్‌మ్యాప్‌ను సైతం జేఏసీ రూపొందించి విడుదల చేసింది. ప్రతి 8 రోజులకు ఒకసారి యాత్రకు విరామం ఇవ్వాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయం తీసుకుంది. ఈ పాదయాత్రకు అవసరమైన అనుమతులు తీసుకునేపనిలో జేఏసీ నేతలు ఉన్నారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. మరోవైపు పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర సమయంలో రైతులు, మహిళలతో పాటు ఒక అంబులెన్స్‌ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. యాత్ర విజయవంతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement