మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రైతుల పాదయాత్ర శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. నేడు శ్రీకాళహస్తి నుంచి 17 కిలోమీటర్ల మేర కొనసాగి అంజిమేడు వరకు పాదయాత్ర సాగనుంది. చిత్తూరు జిల్లా రాచగున్నేరిలో రైతులు భోజన విరామం ఇవ్వనున్నారు. అయితే రాత్రికి చిత్తూరు జిల్లా అంజిమేడులో రైతులు బస చేయనున్నారు.
కాగా, న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట నవంబర్ 1న ప్రారంభమైన రైతుల పాదయాత్ర ఈ నెల 15న తిరుమలకు చేరుకోనుంది. పాదయాత్రకు రైతులు, ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు మద్దతు ప్రకటిస్తూ పాల్గొంటున్నారు. సీఆర్డీఏ, మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఇటీవల వెనక్కి తీసుకున్నా.. రైతులు మాత్రం అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.