అమరావతి – ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.
అయితే ఈసారి మంత్రి వర్గ సమావేశం పేపర్ లెస్‌తో నిర్వహించనున్నారు. ఇంతకు ముందు వరకూ క్యాబినెట్ సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ – క్యాబినెట్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఈ-ట్యాబ్‌లో మంత్రులకు అందజేయనున్నారు.
ఇప్పటికే ట్యాబ్‌ల వాడకంపై సచివాలయ అధికారులు మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. 2014 -19 వరకు టీడీపీ హయాంలో ఈ – కేబినెట్ సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ – క్యాబినెట్ సమావేశాలకు స్వస్తి పలికారు.
గత మంత్రివర్గ సమావేశంలోనే సీఎం చంద్రబాబు తదుపరి మంత్రివర్గ సమావేశాలు పేపర్ లెస్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ – క్యాబినెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.