Monday, November 18, 2024

Amaravathi – ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వకూడదు ? – చంద్ర బాబు కి మంత్రి నాగార్జున ప్రశ్న

గుంటూరు రూరల్, మే, 23(ప్రభ న్యూస్): – కోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబు వక్ర భాష్యం మాట్లాడుతుండడం సిగ్గుచేటు రాజధాని ప్రాంతంలో పేదవారు, కష్టపడి పని చేసుకునేవారు ఉండకూడదనేదే చంద్రబాబు ఆలోచన అని, కోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబు ఇంకా వక్ర భాష్యం మాట్లాడుతుండడం సిగ్గుచేటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సిఆర్డిఏ పరిధి కృష్ణాయపాలెంలోని ఆర్ 5 జోన్ లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ఎంపీ నందిగం సురేష్ , మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్ , లేళ్ల అప్పిరెడ్డిలతో కలిసి పరిశీలించారు.

అనంతరం మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ… చంద్రబాబు చెంప చెళ్ళుమనిపించే విధంగా ఈనెల 26వ తేదీన సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 50వేల మందికి పైగా పేదలకు ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం నిజంగా వారందరి అదృష్టమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం రాష్ట్రంలో విరాజిల్లుతుందని దానికి నిదర్శనం, నిలువుటద్దం… ఈప్రాంతంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదురొడ్డి పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడమేనన్నారు.

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం సీఎం జగన్ మోహన్ రెడ్డి త్రికరణ శుద్ధికి తార్కాణమన్నారు. చంద్రబాబు లాంటి దరిద్రులు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నంత కాలం అంటరానితనం, అస్ప్రుశ్యత కొనసాగుతూనే ఉంటుందని, చట్టాలు అపహాస్యం పాలవుతూనే ఉంటాయని విమర్శించారు. ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వకూడదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ… గతంలో ప్రతిపక్షాలు పేదల సమస్యలపై పోరాడేవని, నేడు ప్రతిపక్షాలన్నీ కలిసి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని పోరాటం చేయడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు.

- Advertisement -

ఓ సామాజిక వర్గం పక్కన అణగారిన వర్గాలు ఉండకూడదనే వారి ఆలోచన అని, భూములన్నీ చంద్రబాబు, లోకేష్ లు వారి సొంత భూములు అయినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు అని, రాజకీయంగా ఆయనకు సమాధి కట్టేందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. లోకేష్ ఒక దద్దమ్మ అని, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు ఉన్నారని, వీరంతా కలసి పేదల ఇళ్ల స్థలాలు విషయంలో ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. సిపిఎం పార్టీ నేతలు సైతం వీరికి వత్తాసు పలుకుతూ చంద్రబాబుతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement