అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై ఏమాత్రం శ్రద్ధ లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ప్రాంతంలో చూసినా రైతులు, కౌలు రైతులు నష్టాలు చవిచూస్తూ మానసిక స్థైర్యం కోల్పోయారని ఆయన తెలిపారు. వారి కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని పేర్కొన్నారు. సాగు నష్టాలు, అప్పుల భారంతో కుంగిపోయి అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన జయరామిరెడ్డి, నంద్యాల జిల్లా తాటిపాడుకి చెందిన కౌలు రైతు, ఆ గ్రామ ఎంపీటీ-సీ చిన్న శంకర్, ఎన్టీఆర్ జిల్లా జయంతికి చెందిన ఇప్పల శ్రీనివాసరెడ్డి బలవన్మరణం చెందినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
వారి కుటు-ంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపిన పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రైతు ఆత్మహత్య గురించి వింటూనే ఉన్నామని, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాలకుల్లో చలనం రాకపోవడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోయినా జనసేన అండగా నిలుస్తుందని, కౌలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణ అర్హత కార్డులు దక్కేలా పోరాడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.