అమరావతి, ఆంధ్రప్రభ : ఏడాదికేడాది పెరుగుతున్న రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు సస్యరక్షణ ఖర్చు తగ్గనుంది.. ఈ నేపధ్యంలో క్రిమి కీటకాల నుంచి పైర్ల సంరక్షణ కోసం రసాయన మందుల వాడకాన్ని కొంత మేరకైనా తగ్గించేందుకు రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. సౌర శక్తితో పనిచేసే క్రిమి, కీటక నాశక యంత్రాలను రాయితీ ధరతో రైతులకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు 1.08 కోట్ల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. రసాయన మందులు వినియోగం కూడా పెరిగిపోతోంది. ఖరీదైన వీటి వాడకం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవడంతో పాటు అటు పర్యావరణానికి, ఇటు ప్రజల ఆరోగ్యానికి రసాయన మందులు చేటు- కలిగిస్తున్నాయి.
ఈ తరుణంలో వీటికి ప్రత్యామ్నాయంగా సోలార్ క్రిమి, కీటక సంహార యంత్రాలను వినియోగించడం సర్వత్రా ప్రయోజనకారి అవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ యంత్రం ఒక్కొక్కటి రూ.6,200 ఉంటు-ందని, రైతులకు రాయితీపై సగం ధరకే అంటే రూ.3,200 అందిచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు- తెలిపారు. రాయితీకయ్యే నిధులను సాంప్రదాయేతర ఇరధన వనరుల శాఖ భరిస్తుందని పేర్కొన్నారు. సౌరశక్తితో నడిచే ఈ యంత్రాలను క్రిమి, కీటకాలను ఆకర్షించి పైర్లను రక్షిస్తాయని, ఒక ఎకరా పొలానికి రెండు, మూడు పరికరాలు వినియోగించవచ్చునని తెలిపారు. రసాయన మందులకయ్యే వ్యయంతో పోలిస్తే ఇవి తక్కువకే లభిస్తాయని, పైర్ల సంరక్షణ కూడా మెరుగ్గా ఉంటుందని తెలిపారు.