Saturday, November 23, 2024

దేశంలో గుర్తుండిపోయే విధంగా అల్లూరి జయంత్యుత్స‌వాలు.. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఏర్పాట్లు: కిషన్‌ రెడ్డి..

భీమవరం, (పశ్చిమ గోదావరి) ప్రభ న్యూస్‌ : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహణకు ఉత్సవ కమిటీ ని ఏర్పాటు చేసి, దేశంలో ప్రజలందరికీ గుర్తుండిపోయే విధంగా జయంతి వేడుకలను నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహణ, ప్రధానమంత్రి రాక ఏర్పాట్లు పై ఆదివారం కేంద్రమంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం చాలామంది ఉద్యమాలు చేశారని, కానీ పోరాటం చేసి, బలిదానమైనవారు కొందరేనని, వారిలో అల్లూరు సీతారామరాజు ఒకరని అన్నారు. అల్లూరి చరిత్రపుటల్లో ఉండి చాలామందికి తెలియని వ్యక్తి అని, అటువంటి వ్యక్తి గురించి దేశంలో అందరికీ తెలిసే విధంగా ఆయన 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేది ప్రధానమంత్రి సంకల్పమన్నారు.

అల్లూరి సీతారామరాజు పుట్టిన, చదువుకున్న , సంచరించిన,, నివసించిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రముఖులను ఆహ్వానించామని కేంద్రమంత్రి తెలిపారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు పనులు మొదలు పెట్టాలని సూచించారు ..భీమవరం లో నిర్వహించే కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి ప్రజాప్రతినిధులు వివిధ కమిటీ ల ఏర్పాటు లో భాగస్వాములు కావాలన్నారు. విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు-కు కేంద్ర ప్రభుత్వం రూ. 35 కోట్లు మంజూరు చేసిందని, ఉత్సవాలు ముగింపు నాటికి దీన్ని పూర్తిచేసుకుని ప్రారంభించాలని లక్ష్యంగా ఉందన్నారు. అల్లూరి పోరాటాల గురించి అందరికి తెలియజేయాలని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహణకు అందరూ కలిసి రావాలని కోరారు.

ఎనిమిది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు : మంత్రి కొట్టు సత్యనారాయణ..

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 27 నుండి వచ్చే నెల 4 వరకు 8 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం తెలిపే విధంగా రాజకీయాలకు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయాలని ఆయన అన్నారు . అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 8 రోజులు అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని, అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు. రవిప్రకాష్‌ జాయింట్‌ కలెక్టర్‌ జెవి మురళి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు , ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు , క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి. సర్రాజు , మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌ , కనుమూరి బాపిరాజు , గోకరాజు రంగరాజు , శ్రీనివాసరాజు , సుబ్బరాజు , నరసింహ రాజు , భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement