అమరావతి, ఆంధ్రప్రభ: అనారోగ్యంతో ఉన్న తాను మూడు నెలల పాటు వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని మాజీ మంత్రి పొంగురు నారాయణ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు, మాస్టర్ ప్లాన్ అలైన్‌మెంట్ మార్పు, డిజైన్లలో అవకతవకల కారణంగా ఆయాచిత లబ్ది పొందారనే అభియోగాలతో సీబీఐ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇంతకు ముందే నారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.
కాగా బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. నిందితులుగా ఉన్న వారు దేశం విడిచి వెళ్లరాదని అలాంటిదేమైనా ఉంటే కోర్టు అనుమతి తీసుకోవాలని గత విచారణ సందర్భంగా షరతులు విధించిన నేపథ్యంలో షరతులను సడలించాలని తాను 3 నెలల పాటు అమెరికాలోనే ఉండాల్సి వస్తుందని ఆరోగ్య కారణాల రీత్యా అనుమతివ్వాలని నారాయణ కోరారు. గతంలోనే ఇందుకు షెడ్యూలు ఖరారైందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి సానుకూలంగా స్పందిస్తూ మూడు నెలల పాటు అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.