Friday, November 22, 2024

AP | ఇంజనీరింగ్‌ తుదిదశలో 9,120 మందికి సీట్ల కేటాయింపు

అమరావతి,ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించిన ఎపి ఇఎపి సెట్‌ 2023 తుదిదశ అడ్మిషన్ల ప్రక్రియ తుదిఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌, అడ్మిషన్ల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి గురువారం విడుదల చేసారు. చివరి దశలో 50,378 అభ్యర్థులు ఎంపిక ప్రక్రియను వినియోగించుకోగా, వారిలో 9,120 మందికి వివిధ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. మొత్తం 254 కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 1,21,997 ఉండగా, 94,407 సీట్లను భర్తీ చేసామని నాగరాణి ఈ సందర్భంగా వివరించారు.

26 విశ్వవిద్యాలయ కళాశాలల్లో 7,531 సీట్లకు గాను 5,513 సీట్లు భర్తీ చేసామన్నారు. 222 ప్రవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఉండగా, అక్కడ 1,10,343 సీట్లు ఉన్నాయని, వీటిలో 85,111 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఆరు ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 4,123 సీట్లు కన్వీనర్‌ కోటాలో ఉండగా, 3783 భర్తీ అయ్యాయన్నారు. ఎపి ఇఎపి సెట్‌ 2023లో అర్హత పొందిన అభ్యర్థుల మొత్తం సంఖ్య 1,57,513కాగా, చివరి దశ వరకు నమోదు చేసుకున్న అభ్యర్థులు 1,04,448గా ఉన్నారు.

నమోదు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థుల సంఖ్య 1,03,856గా ఉంది. ప్రత్యేకించి తుది దశలో నమోదు చేసుకున్న అభ్యర్థులు 1277 మంది ఉన్నారు. ఈ దశలో కళాశాలల మార్పులకు సంబంధించి 20,202 అభ్యర్ధనలు నమోదు కాగా, వాటిని కూడా పరిగణన లోకి తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ ముగించామని చదలవాడ నాగరాణ వివరించారు. ఇప్పటికే మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభం అయినందున 25వ తేదీ లోపు విద్యార్ధులు అయా కళాశాలల్లో ప్రవేశాలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement