అమరావతి, ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే కమర్షియల్ విభాగంలో ఆదాయాన్ని ఆర్జించే కాంట్రాక్టులకు సంబంధించి ఈ–టెండరింగ్ విధానానికి బదులు ఈ- వేలం విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానంలో ఎస్‌ఎల్‌ఆర్‌ల లీజింగ్ ఒప్పందాలు, వాణిజ్య ప్రకటనలు, పార్కింగ్ తదితర కమర్షియల్ కాంట్రాక్టులను ఖరారు చేసే సమయాన్ని తగ్గించడానికి వీలు కలుగుతుంది. ఇందులో భాగంగా మొదటి దశలో ఈ విధానాన్ని అమలు చేయడానికి దేశవ్యాప్తంగా 11 డివిజన్లను ఎంపిక చేయగా.. వాటిలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ కూడా ఒకటి. తదనుగుణంగా, దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారిగా సికింద్రాబాద్ డివిజన్లో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా రెండు కాంట్రాక్టులు విజయవంతంగా కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు ప్రతిరోజూ నడిచే ట్రైన్ నెం. 12710 సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని రేర్ ఎస్‌ఎల్‌ఆర్‌లో పార్శిల్ స్పేస్ లీజింగ్ కోసం ఈ వేలం నిర్వహించారు. రెండు సంవత్సరాల కాలానికి రూ. 36.7 లక్షల విలువైన కాంట్రాక్టును ఈ- వేలంలో విజేతగా నిలిచిన బిడ్డర్‌కు కేటాయించారు. అలాగే కాజీపేటలో లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద వాణిజ్య ప్రకటనలకు సంబంధించి నిర్వహించిన ఈ- వేలంలో మూడేళ్ల వ్యవధికి రూ. 75 వేల మొత్తానికి కాంట్రాక్టును మరో బిడ్డర్ అర్హత సాధించారు. ఈ- టె-ండరింగ్ స్థానంలో ప్రవేశపెట్టిన ఈ- వేలం విధానం రైల్వేలకు, బిడ్డర్లు ఉభయులకు ప్రయోజనకరంగా ఉండనుంది.
ఈ- వేలం ప్రక్రియలో కనీస అర్హత నిబంధనలతో ఒప్పందాలను ఖరారు చేయడంలో చాలా సమయం ఆదా అవుతుంది. రూ. 10 వేల వన్ -టె-మ్ రిజిస్ట్రేషన్ చార్జీతో భారతీయ రైల్వేలో ఏదైనా డివిజన్, యూనిట్లో ఏ ఆదాయ కాంట్రాక్ట్ కోసం వేలంలో అయినా బిడ్డర్లు పాల్గొనవచ్చు. అంతే కాకుండా కాంట్రాక్టు కేటాయించినట్టు- లేఖ, బిడ్ షీట్ వెంటనే జారీ చేయడం జరుగుతుంది. అలాగే వేలం నిర్వహించిన 72 గంటలలోపు ఆన్‌లైన్ సంతకంతో ఒప్పందం జారీ అవుతుంది. వేలం నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి వీలైనంత త్వరగా కాంట్రాక్ట్ ప్రారంభించబడటానికి అవకాశం ఉంటుంది. ఈ వినూత్న విధానాన్ని వేగవంతంగా అమలు చేయడంలో కృషి చేసిన సికింద్రాబాద్ డివిజన్, కమర్షియల్ బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. ఈ విధానంతో ఆదాయాన్ని ఆర్జించే వాణిజ్య ఒప్పందాల ఖరారును సులభతరం చేస్తుందని, రైల్వేలు, వేలంలో పాల్గొనే వారి విలువైన సమయం కూడా ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తవడం, పారదర్శకంగా ఉండడంతో రైల్వేలకు, వేలంలో పాల్గొనేవారికి పరస్పర ప్రయోజనకరంగా ఉంటుందని, వాణిజ్య సంస్థలు తమ వ్యాపార విస్తరణకు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి