రాజమహేంద్రవరం, ప్రభన్యూస్ బ్యూరో: వైకాపా వాళ్ళు జంతువులు. కాబట్టి సింగిల్‌గానే వస్తారు.. మేం మనుష్యులం.. కలిసే వెళ్తాం.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుగా ముందుకెళ్తాయి. బీజేపీని కూడా కలవమని ఆహ్వానిస్తాం.. వస్తుందని ఆశిస్తున్నామంటూ జనసేనాని పవన్‌కల్యాణ్ మీడియాకు వెల్లడించారు. గురువారం ఆయన చంద్రబాబును కలుసుకునేందుకు ప్రత్యేకంగా రాజమండ్రికొచ్చారు. విమానంలో మధురపూడికొచ్చిన ఆయన రాజమండ్రి కేంద్ర కారాగానికెళ్ళి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.
అంతకుముందే చంద్రబాబును కలిసేందుకు లోకేష్, బాలకృష్ణ లోనికెళ్ళారు. వారిద్దరితో కలిసే పవన్‌కల్యాణ్ చంద్రబాబుతో సుమారు 40నిమిషాలు చర్చలు జరిపారు. అనంతరం కారాగారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొత్తు గురించి ఆయన స్పష్టతిచ్చారు. రాష్ట్రంలో వైకాపా అరాచకాల్ని, దోపిడీల్ని అడ్డుకునేందుకు టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేయడం సరికాదన్నారు. అలాగే చేస్తే ఈ అరాచకం దశాబ్ధాల పాటు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో సామాన్యుడి బ్రతుకు మరింత దుర్భరమౌతుందన్నారు. శాంతిభద్రలు క్షీణిస్తాయన్నారు. జగన్ దుష్టపాలనను సమిష్టిగా ఎదుర్కొంటామన్నారు.
బాబుకు సంఘీభావం :
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి పవన్‌కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఆయనపై అక్రమంగా కేసులెట్టి అన్యాయంగా రిమాండ్‌కు పంపారన్నారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. ఓ బ్యాంక్‌లో క్రింది స్థాయి వ్యక్తి చేసిన తప్పుకు బ్యాంక్ చైర్మన్‌ను అరెస్ట్ చేస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతే ఏ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి పైళ్ళపై సంతకాలు చేయరన్నారు. తప్పులు జరిగితే సంబంధిత వ్యక్తుల్ని విచారించాలన్నారు. లక్షల కోట్ల ఆదాయమొస్తున్న సైబరాబాద్‌ను నిర్మించిన వ్యక్తిపై రూ. 371కోట్ల అభియోగాలు మోపి జైల్లో పెట్టడం సమంజసం కాదన్నారు. అయినా అవినీతి జరిగితే విచారించాల్సింది ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తోందంటూ పవన్ ప్రశ్నించారు.
ఏ ఒక్కర్నీ వదలం :
రాయి వేసేప్పుడే ఆలోచించుకోవాలి.. నీ అధికారం ఆరుమాసాలే.. ఆ తర్వాత టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకొస్తుంది. ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుపడుతుంది. మాజీ పాలకుల పై కేసుల బనాయింపును మీరు మొదలెడితే అది భవిష్యత్‌లో కూడా కొనసాగుతుంది. ఈ విషయాన్ని జగన్‌తో పాటు ఆయన మద్దతుదార్లు కూడా గుర్తుంచుకోవాలి. ఇక రాష్ట్రంలో జగన్‌తో యుద్దం తప్పదు. ఇందుకు తామంతా సిద్దంగా ఉన్నామంటూ పవన్ స్పష్టం చేశారు. ఇసుక, మైనింగ్, బెల్ట్‌షాపుల్తో సహా అన్నింటిలో జరిగిన అవినీతి తామధికారంలోకి రాగానే వెలికి తీస్తామని పవన్ హెచ్చరించారు. మాజీ సిఎమ్‌ను రిమాండ్‌లో పెట్టినప్పుడు జగన్‌ను రిమాండ్‌కు పంపి తీరుతామని తేల్చిచెప్పారు.
బాబుతో విధానపర విభేదాలే :
గతెన్నికల్లో చంద్రబాబుకు, తనకు మధ్య విధానపర భిన్న ఆలోచనల కారణంగానే విడివిడిగా పోటీ చేశామని పవన్ స్పష్టం చేశారు. 2014లో తాను టీడీపీకి మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటికే రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. అప్పటి కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికేం సాధించలేక పోయారు. తీవ్ర అన్యాయం చేశారు. సగటు మనిషి వేదననే తాను కూడా అనుభవించానని పవన్ చెప్పారు. తన విధానాలు కొందరికి ఇబ్బందికలగొచ్చాన్నారు. కానీ దక్షిణ భారతంలో మొదటగా మోడికి మద్దతిచ్చింది తానేనన్నారు. దేశానికి బలమైన నాయకుడి అవసరాన్ని తాను గుర్తించానన్నారు. విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు తన అనుభవం, శక్తిసామర్ద్యాల్తో పూర్వవైభవం సాధిస్తారన్ని ఆశించానన్నారు. కేవలం ప్రత్యేక హోదా విషయంలోనే తాను చంద్రబాబుతో విబేధించి విడిపోయానన్నారు. అంతే తప్ప తాను చంద్రబాబును ఏనాడూ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ఈ రోజు చంద్రబాబుపై అభియోగాలు మోపిన వ్యక్తి లాల్‌బహదూర్‌శాస్త్రా ? వాజ్‌పేయా ? అంటూ ప్రశ్నించారు.
శాంతిభద్రతలపై ప్రశ్నిస్తే కేసులెడతారా ?
రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నిస్తే కేసులెట్టి వేధించడాన్ని పవన్ నిలదీశారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో తాను విబేధిస్తానన్నారు. తనను రాష్ట్ర సరిహద్దుల్లో నడిరోడ్డుపై నిలిపేశారన్నారు. ఇంట్లో కూర్చోవాలని నిబంధనపెడుతున్నారన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలకడంలో ముందూ వెనుకలు ఆలోచించడంలేదన్నారు. వైకాపా నాయకులు హత్యలు, అరాచకాలు చేస్తున్నా అధికారులు కేసులెట్టడంలేద ు. ముంద్రా పోర్టులో రూ. 21వేల కోట్ల విలువైన 3వేల కిలోల హెరాయిన్ దొరికితే దాని మూలాలు విజయవాడలో ఉన్నట్లు తెలిసినా ఏ ఒక్కర్ని అదుపులోకి తీసుకోలేదన్నారు. వైకాపా నాయకులు బూతులు తిడితే విశాఖలో రోడ్లపైకొచ్చిన నిరసన తెలిపిన జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులెట్టారన్నారు.
మోడీ దృష్టికి తెస్తా :
చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి బిజెపి కుట్ర ఉందన్న అంశాన్ని తాను విశ్వసించడంలేదని పవన్ చెప్పారు. ప్రతి అంశంపైన బీజేపీ పెద్దలు స్పందించాలనుకోవడం కూడా సబబు కాదన్నారు. ఏపీలో నెలకొన్న అనిశ్చితి దేశంపై ప్రభావం చూపిస్తుందన్నారు. అందుకే ఈ అంశాన్ని తాను ప్రధాని మోడీ,, హోమ్‌మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానన్నారు. చంద్రబాబుకు జైల్లో భద్రత పట్ల పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాజశేఖరరెడ్డిని రాజకీయంగా విమర్శించిన ఆయన మరణం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. అలాగే జగన్ 16మాసాలు జైల్లో ఉన్నప్పటికీ తానేం సంతోషించలేదన్నారు. కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చే హైటెక్ సిటీ నిర్మించిన వ్యక్తికి ఈ దుర్గతి పట్ల తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు. చంద్రబాబును ఆయన ఆరోగ్యం గురించి అడిగానన్నారు. 151సీట్లతో వైకాపాను ప్రజలు గెలిపించారు. ఆయన అద్బుతంగా పాలిస్తే అభినందించుండేవాడని, కానీ ఆయన ప్రజాకాంక్షకు విరుద్దంగా పాలిస్తున్నారన్నారు. జగన్ గురించి ప్రతి అంశం ప్రధాని మోడికి తెలుసన్నారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మోడి సమీక్షిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఆయన్తో పాటు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.