( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హైడ్రామాలు, ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడమే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. తప్పులన్నీ వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్న కూటమిలోని నేతలు తమపై నిందలు వేసి పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు చేస్తున్న హైడ్రామాలు సినిమాలకంటే మించిపోతున్నాయన్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బాధ్యత అన్నట్టుగా చిత్రీకరించదానికి సినిమా స్టైల్ లో హైడ్రామా చేసారన్నారు. కూటమి ప్రభుత్వం అబద్దాలు మీద అబద్దాలు చెప్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని, ప్రభుత్వ పోర్టు నుండి బియ్యం మొత్తం రవాణా అవుతుంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేతిలో ఉంటే ఎవరిమిద బురదజల్లుతారని ప్రశ్నించారు.
కాకినాడలో ఉన్నవి రెండు పోర్టులు డిప్-సి పోర్టు, యాంకరేజ్ పోర్ట్ లని, యాంకరేజ్ పోర్ట్ నుండి బియ్యం రవాణా జరుగుతుందని, ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన పోర్టు..అరబిందో కి ఏమి సంబంధం ఉందన్నారు. కాకినాడలో సి పోర్టును 1999 లో ప్రయివేటు పరం చేశారని, అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారని గుర్తు చేశారు. రామాయపట్నం, మచిలీపట్నం, ములపేట పోర్టులు చంద్రబాబు మనుషులకు ఎలా అప్పగించారో అలానే జరిగిందన్నారు. పోర్టు నుండి సరుకు ఎగుమతి చేయాలంటే కస్టమ్స్ క్లియరెన్స్ తప్పని సరి, కస్టమ్స్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందని, పోర్టులో ఉన్న అధికారులు, చెక్ పోస్టుల్లో ఉన్న అధికారులు, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటారని, వారికి తెలియకుండా బియ్యం ఎగుమతి జరిగిపోతుందని చెప్పడం కూటమి ప్రభుత్వం చేతకాని తనమా అని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం బాధ్యత వహించకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని, వైస్సార్సీపీ హయాంలో ఇంటి ఇంటికి ప్రత్యేక వాహనాల్లో రేషన్ అందించామన్నారు. ఆరు నెలల్లో కూటమి పాలనలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మోసపూరిత సూపర్ 6 హామీలు ఇచ్చి ఏపీ ప్రజలను నిట్టనిలువునా ముంచారని ఆరోపించారు.