విశాఖపట్నం, ప్రభన్యూస్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి చేపట్టా లని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. అందులో భాగంగానే విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుండి రెండు రోజులపాటు విశాఖపట్టణంలో పెట్టుబడుల పండుగ జరగబోతోంది. దీంతో ప్రపంచ దేశాలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు వైజాగ్‌కు పెద్ద ఎత్తున తరలిరాబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొని తమతమ సంస్ధల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌ తున్నారు. ఈకార్యక్రమాన్ని జగన్‌సర్కార్ ఓ సవాల్‌గా తీసుకుని నిర్వహిస్తోంది. అందుకోసం రెండు నెలల ముందుగానే ఏర్పాట్లు చేపట్టింది. దీంతో రెండు రోజులపాటు జరిగే కార్యక్రమాల పై అధికారపార్టీతోపాటు .రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా దృష్టి సారిస్తున్నాయి. దీంతో పెట్టుబడుల సదస్సుకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే మంత్రులంతా విశాఖకు చేరుకున్నారు. గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా విశాఖకు బయలుదేరబోతున్నారు. మూడు రోజులపాటు విశాఖలోనే ఆయన బస చేయబోతున్నారు. ప్రత్యేకించి వైజాగ్‌ను పాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నాక ఆప్రాంతంలో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం పెట్టుబడుల సదస్సు. దీంతో సీఎం జగన్ కూడా ఆకార్యక్రమాన్ని ఓసవాల్‌గా తీసుకుని నిర్వహించబోతున్నారు.
వైజాగ్‌కు సీఎం జగన్
నేటి నుంచి మూడు రోజుల పాటు- సీఎం జగన్ విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. అందుకోసం గురువారమే సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్ హోటల్‌లో జీఐఎస్ డెలిగేట్స్‌కు ఏర్పాటు-చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం రాత్రి బస చేసి శనివారం ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
తొలిసారిగా విశాఖలో మూడు రోజుల బస
విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల్లో భాగంగా ఇప్పటికే అందుకు సంబంధించిన బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపడంతోపాటు ఆతరువాత సాంకేతిక కారణాలతో ఆబిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్ అనేక సందర్భాల్లో విశాఖపట్టణ ం పర్యటనకు వెళ్లినప్పటికీ ఒక్క రోజుతోనే కార్యక్రమాలు ముగించుకుని తిరిగి అమరావతికి చేరుకునేవారు. అయితే, ఉగాది తరువాత సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ గురువారం నుండి మూడు రోజులపాటు విశాఖలోనే బస చేయబోతున్నారు. దీంతో పెట్టబడుల సదస్సుకు మరింత ప్రాధాన్యత, ప్రాముఖ్యత పెరిగినట్లయింది.
మంత్రులంతా అక్కడే..
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేదిశగా మంత్రులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను స్వయంగా ఆహ్వానించారు. అలాగే వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. తాజాగా శుక్ర, శని రెండు రోజులపాటు జరిగే పెట్టుబడుల సదస్సులో పాల్గొని దేశ విదేశాల నుండి వచ్చే ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనస్వాగతం పలికేందుకు మంత్రులంతా బుధవారమే విశాఖకు చేరుకున్నారు.
రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
విశాఖ వేదికగా జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కార్యక్రమంలో సుమారు 25 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 7,500 మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏపీలో అందుబాటులో ఉన్న వనరుల గురించి ప్రభుత్వ పెద్దలు సదస్సులో మరోసారి స్పష్టంగా వివరించబోతున్నారు. ఆదిశగానే రాష్ట్రంలోని కోస్తా తీరాన్ని రూపుదిద్దారు. మరికొన్ని జిల్లాల్లో అనుకూలమైన భూములను కూడా కొత్త పరిశ్రమలక సిద్ధం చేశారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.