ఏపీలో రేపు (జులై 1) ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి రేపు రూ.7 వేలు అందించనున్నారు. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుండడం విశేషం. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు చంద్రబాబు స్వయంగా పింఛను ఇవ్వనున్నారు. జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి దాదాపు 1,20,097 మంది సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పింఛను అందజేయనున్నారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పింఛను ఇవ్వనున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ను రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000 పెంపుదల చేశారు. ఈ విభాగంలో 24,318 మంది పెన్షన్ అందుకోనున్నారు.