ఖాకీపై ఖద్దరు గెలుపు
ఒక్కో బరికి రూ.50 లక్షల దాకా ఖర్చు
ఆధునిక వసతులతో ఏర్పాట్లు
ఎల్‌ఈడీ స్క్రీన్లు, విద్యుత్ లైట్లు, జనరేటర్లు
పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు
కాకినాడ, ఆంధ్రప్రభ: సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయక కోడిపందాలకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామాల వారీగా బరుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. తాళ్ళరేవు మండలం సుంకరపాలెం వద్ద విశాలమైన ఆవరణలో అత్యాధునిక సదుపాయాల్తో అతిపెద్ద బరిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థలానికి ఏకంగా 32లక్షల అద్దె చెల్లిస్తు న్నారు. కేవలం బరి ఏర్పాటు కోసమే 50లక్షలకుపైగా వెచ్చిస్తున్నారు. ఇక్కడ జరిగే కోడిపందాల్లో లక్షల్లో చేతులు మారే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. ఉమ్మడి తూర్పుతో పాటు పలు జిల్లాల్నుంచి కూడా ఇక్కడ పందాలాడేందుకుపలువురు ఆసక్తి పరులొస్తున్నట్లు సమాచారం. వీరంతా కూర్చుని ప్రత్యక్షంగా పోటీల్ని తిలకిస్తూ ప ందాలాడేందుకు నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే నగదు మారకానికి వీలుగా ఆన్‌లైన్ చెల్లింపుల సదుపాయాన్ని కూడా కల్పిస్తు న్నారు. స్వైపింగ్ మిషన్‌లను కూడా ఇక్కడ అందు బాటులో పెడుతున్నారు.
ఒకేసారి 3వేల మంది చుట్టూ కూర్చుని చూసేందు కు వీలుగా ఈబరుల్ని తయారు చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు వీక్షించేందుకు అనుగుణంగా ఎల్‌ఇడి స్క్రీన్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రిపూట సైతం పందాలు జరిగే విధంగా మిరుమిట్లు గొలిపే విద్యుత్ లైట్లు, వాటికనుబంధంగా జనరేటర్‌లను సిద్దం చేస్తున్నారు. అలాగే ఐ పోలవరం మండలం కేశనకుర్రు లోనూ భారీ ఎత్తున బరులు సిద్దమౌతున్నాయి. రాజోలు మండలం శివకోడు, మల్కిపురం, సఖినేటిపల్లి మండ లాల్లోనూ బరుల తయారీమొదలైంది. జగ్గం పేట, తుని నియోజకవర్గాల్లో కూడా బరుల ఏర్పాటుకు నిర్వాహ కులు సిద్దమయ్యారు. కొవ్వూరు, రాజానగరం నియోజక వర్గాల్లోనూ జోరుగా కోడిపందాల నిర్వహ ణకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
సంక్రాంతికి నెలరోజుల ముందునుంచే ఈ సారి కోడిపందాలు జరగనిచ్చేదిలేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో పందాలు నిర్వహించిన వారి వివరాల్ని సేకరించారు. సుమారు ఏడొందల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. కొందర్ని సొంత పూచీకత్తుపై విడుదల చేయగా మరికొం దర్నుంచి ఐదులక్షల విలువైన పూచీకత్తును పోలీసులు తీసుకున్నారు. వీరంతా ఈ సారి బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తే కఠిన చట్టాల క్రింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తమ ఆజ్ఞ ను ఉల్లంఘిస్తే 25లక్షల వరకు అపరాద రుసుం విధిస్తామన్నారు. దీంతో రెండుమూడువారాల క్రితం వరకు సంక్రాంతి సంబ రాల్లో సంప్రదాయ కోడిపందాల నిర్వహణపై అయో మయ పరిస్థితి నెలకొంది.
కాగా సంక్రాంతి దగ్గరపడేసరికి రాజకీయ నాయ కులు, అధికార పార్టీ పెద్దలు బరిలో దిగారు. గ్రామా ల్నుంచొస్తున్న ఒత్తిళ్ళకు వారంతా తలొగ్గారు. ఇప్పటికే కనీసం సంక్రాంతి మూడ్రోజులు కళ్ళుమూసుకుని ఉండాల్సిందిగా పోలీసులకు చెప్పాలంటూ ముఖ్యమం త్రిపై ఒత్తిళ్ళు మొదలెట్టారు. అయితే అమరావతి నుంచి స్పష్టమైన ఆదేశాలు విడుదల కాలేదు. దీంతో స్థానికం గానే పోలీసులపై ఒత్తిళ్ళు ప్రారంభించారు. మరో వైపు ఈ ఏడాది వివిధ నగరాల్నుంచి సొంతూళ్ళకొచ్చే యువత ను పందాల్నుంచి దారి మళ్ళించేందుకు పోలీసులు ప్రతి చోట సంప్రదాయ క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇందులో కబడ్డీ, క్రికెట్, హాకీ వంటి క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతల్ని గౌరవిస్తూ బహుమతుల్ని అందిస్తున్నారు. తద్వారా యువత కోడిపందాలవైపు మళ్ళరని పోలీసులు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితులిందుకు భిన్నంగాఉన్నాయి. కబడ్డీ, హాకీ, క్రికెట్లు ఆడుతూనే యదావిధిగా కోడిపందాల వైపు జనం ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఏ క్షణంలో పందాలు మొద లైనా పాల్గొని పందాలు కాసేందుకు ఉరుకుపరుగుల మీద సిద్దమౌతున్నారు.
పోలీసుల ప్రయత్నం దాదాపుగా విఫలమైనట్లే. వారు నిర్వహిస్తున్న సంప్రదాయ క్రీడోత్సవాలు పేరుకు మాత్రమే. అవేవీ కోడిపందాలపై ప్రజల ఆసక్తిని దారి మళ్ళించలేక పోయాయి. కాగా కనీసం ఆ మూడ్రోజులు చూసీచూడనట్లుండడంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్నుంచి పోలీసులకు ఒత్తిళ్ళు పెరిగాయి. అయితే క్రిందిస్థాయి పోలీసులు సుముఖంగా ఉన్న ఉన్నత స్థాయి యంత్రాంగం మాత్రం ఈ వ్యవహా రంపై పట్టు సడలించేందుకు ఏమాత్రం సిద్దంగా లేరు. ఈ విషయాన్ని గుర్తించిన అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనీసం నాలుగురోజుల పాటు సెలవుపై వెళ్ళిరండంటూ పోలీస్ ఉన్నతాధికారులకు సూచిస్తు న్నారు. ఇదే విషయాన్ని వీరికి తెలియజేయమంటూ అమరావతిలోని తమ పార్టీ పెద్దల్ని కోరుతున్నారు. దీంతో అత్యున్నత పోలీస్ అధికారులు సంక్రాంతి పేరిట సెలవులెట్టి తమ సొంతూళ్ళకెళ్ళేందుకు సిద్దమౌతున్నా రు. ఇక స్టేషన్ల వారీ ముడుపులు సిద్దమౌతాయి. బరుల్లో పందాలు యదావిధిగా సాగుతాయి. లక్షల్లో చేతులు మారతాయి. ఈ మూడ్రోజుల వ్యవధిలో కొందరు ల క్షాధికారులు సమస్తం కోల్పోతారు. మరికొందరు స్వల్ప వ్యవధిలోనే పందాల్లో ఆర్ధికంగా లాభం పొందుతారు. హైదరాబాద్, మద్రాస్, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాల్నుంచి స్వగ్రామాలకొచ్చే జనం పందాల సరదాను తీర్చుకోనున్నారు.