Friday, November 22, 2024

MP Seat – బందరు లడ్డూ ఎవరికో!? అన్ని పార్టీల్లోనూ ఎంపీ అభ్యర్థిపై వీడని మిస్టరీ

(ప్రభన్యూస్, మచిలీపట్నం) – రాజకీయం అంటే ఇంతే. ఇదో కుర్చీలాట. ఈ క్షణం ఇక్కడ కనిపించిన నాయకుడు మరో క్షణంలో ఎక్కడ ప్రత్యక్షమవుతాడో?. జాతకం రత్న మిడతం భొట్లకే తెలీదు. కుయ్యో కొర్రు కొండ దొరకే ఎరుక దొరకదు. ఇలాంటి మహాత్తర సన్నివేశాలు రాజకీయాల్లోనే సాధ్యం. ఇప్పటివరకూ ఒక పార్టీలో ఉన్న నాయకుడు మంత్రో, శాసనసభ్యుడో? ఎవరో ఒకరు తమ అధినాయకుడిని కీర్తిస్తూ తమ పార్టీలో ఇంత గొప్ప నాయకుడు మరొకరు లేరని, ఈ రాష్టాన్నిసుభిక్షంగా..అవినీతిలేని దిశగా తీర్చిదిద్దేది మా అధినేతేనని స్తుతించిన వారే, మరుక్షణం వేరే పార్టీలో చేరి అప్పటివరకూ పొగిడిన అధినేతపై ఇష్టమొచ్చినట్లు తిట్ల దండకం అందుకోవటం సర్వసాధారణంగా మారింది.

జనసేన గూటిలో బాలశౌరి..

ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయపార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికలో లాభ, నష్టాల భేరీజుతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంటుకు ఆయా పార్టీల తరుపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక మరీ సంక్లిష్టంగా మారింది.ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది. బాలశౌరి నిర్ణయం ఎలా ఉన్నా, వైసీపీ అధిష్టానానికి ఇది ఒక ఉదంతం కాదు.. ఇలాంటి సన్నివేశాలు రోజు రోజుకూ తెరమీదకు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనలో ఇదే సన్నివేశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ స్థితిలో మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో ఏ పార్టీ తరుపున ఎవరు పోటీ చేస్తారో కూడా ఊహక్కూడా అందడం లేదు. పలు నియోజకవర్గాల్లో కూడా ఇవే పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంటుకు జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుత ఎంపి బాలశౌరి పోటీచేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా జనంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. బందరు పోర్టు, గుడివాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు నిధుల సాధనే కాదు, బందరు, రేపల్లె రైల్వేలైను, విజయవాడ నుంచి పినాకినీ, రత్నాచల్ సూపర్ ఫాస్ట్ రైళ్లతో మచిలీపట్నం లింకు రైలు కూడా త్వరలో రైల్వే బడ్జెట్టులోకి రాబోతున్నాయని, ఇందుకు బాలశౌరి ప్రయత్నాలే కారణమని ఇప్పటికే ప్రచారం ఊపకందుకుంది.

టీడీపీలో ఎడతెగని మీమాంశ

రెండుసార్లు ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన కొనకళ్ళ నారాయణ హ్యట్రిక్ సాధించాలనేది సగటు తెలుగు తమ్ముడి ఆశ. వీరిద్దరినీ కాదని మరో కొత్తవ్యక్తిని ఉమ్మడి అభ్యర్థిగా త్వరలో టీడీపీలో చేరనున్న కేపీ.సారథిని పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరిని పోటీ చేయిస్తారో ఇది మరో సస్పెన్స్. అభ్యర్థి అందుబాటు స్థితిలో జనసేనకు అప్పగించి చేతులు కడుక్కునే వ్యూహంలో టీడీపీ ఉందా? అనే చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే, ఉమ్మడి అభ్యర్థిగా బాలశౌరికి టిక్కెట్టు ఇస్తారా? లేక మరో కొత్త కాపు నేతకు అవకాశం ఇస్తారా? ఇలా వీడని ఉత్కంఠత తెలుగుతమ్ముళ్లను పీడిస్తోంది.

- Advertisement -

వైసీపీ సీటు, మహా గిరాకీ.. తెరమీదకు బాడిగ రామకృష్ణ

ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్షాన మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి కు ఎవరు పోటీ చేయనున్నారో దానిపై పెద్ద చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. సరైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం తీవ్రంగా అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. సినీ దర్శకుడు వి.వి. వినాయక్ పేరు తెరమీదకు వచ్చింది. ఇంకోసారి కాపునేత వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధా పేరు వినిపించింది. ఆ తరువాత అనూహ్యంగా మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేరు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఎమ్మెల్యే పదవికే తాను దూరం అని ప్రకటించిన పేర్ని నాని పేరును అధిష్టానం ఎందుకు తెరమీదకు తీసుకువచ్చిందో? జనానికి అర్థం కావటం లేదు.

విలువ‌ల‌కు ప్రాధాన్యం..
ఈ స్థితిలో.. ఇక 2004లో ఎవరూ ఊహించని విధంగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బాడిగ రామకృష్ణను కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లోకి ఆహ్వానించి మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో బాడిగ రామకృష్ణ విజయం సాధించడమే కాకుండా ప్రజల్లో విజయుడిగా గుర్తింపు పొందారు. మచిలీపట్నం నుంచి నేరుగా సికింద్రాబాద్‌, బెంగుళూరుకు రైళ్లను తీసుకొచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి విలువలకు ప్రాధాన్యం ఇచ్చి జనం మదిలో నిలబడిపోయారు. ప్రస్తుత తరుణంలో బాడిగ రామకృష్ణ సేవలను మరోసారి వినియోగించుకోవాలని, ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం వరిస్తుందని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల అభిప్రాయంగా ఉంది.ఒకరకంగా బాలశౌరికి ధీటైన సమాధానం బాడిగ రామకృష్ణ వల్లే సాధ్యమని ఆయన అనుచర వర్గాలు వాదిస్తున్నాయి,

కాంగ్రెస్ వైపు.. పాతకాపుల చూపు

ఇప్పడు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమించిన తరుణంలో.. రానున్న ఎన్నికలకు మచిలీపట్నం పార్లమెంటుకు కాంగ్రెస్‌కు ఏ అభ్యర్థిని రంగంలోకి దించుతారో వేచి చూడాలి. తమ పార్టీకి దూరమైన నేతలందరినీ తీసుకురావాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే జిల్లాలో పలువురు మాజీలు, వైసీపీ అసంతృప్తి వాదులు కాంగ్రెస్ నావకు చుక్కాని వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాసు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి పునః ప్రవేశం పొందారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీకి సుపరిచిత నాయకుడు కనుమూరి బాపిరాజు కీలక బాధ్యతలు చేపట్టారు. కృష్ణాజిల్లాలో బాపిరాజు అనుచరవర్గం తిరిగి కాంగ్రెస్ పార్టీ శిబిరానికి బయలుదేరినట్టు సమాచారం. ఏది ఎలా ఉన్నా మచిలీపట్నం పార్లమెంటు పోటీ రసవత్తరంగా ఉంటుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement