న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరినీ ఈనెల 8లోగా భారత దేశానికి తీసుకువస్తామని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కమిటీ సభ్యురాలు బి.వి.సత్యవతి వెల్లడించారు. గురువారం ఢిల్లీలో జరిగిన కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతదేశ వైద్య విద్యార్థుల గురించి సమావేశంలో చర్చించారు. అనంతరం ఆమె ఆంధ్రప్రదేశ్ భవన్‌కు చేరుకుని ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ చేరుకున్న 86 మందిని పరామర్శించారు. వారి క్షేమ సమాచారా తెలుసుకుని ఆందోళన చెందవద్దంటూ ఎంపీ సత్యవతి భరోసానిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు విద్యార్థులకు వసతి, భోజన, రవాణా, ఇతర సదుపాయాలు అందించారు. భయానక వాతావరణాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు విడతల వారీగా సురక్షితంగా స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు.