Tuesday, November 26, 2024

గిట్టుబాటు ధర పైనే ఆశలన్నీ..! నేటి నుంచి జిల్లాలో పొగాకు కొనుగోళ్లు

ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని పొగాకు పండించిన రైతులకు గిట్టుబాటు ధర గగనమవుతోంది. ధరలు రాక ప్రతి ఏటా నష్టపోవడం రైతుల వంతైయ్యింది. గిట్టుబాటు ధరల పై ప్రజా ప్రతినిధులు కూడా దృష్టి సారించకపోవడంతో మార్కెట్‌లో రైతులు ప్రతి సీజన్‌లో నష్టపోతూనే ఉన్నారు. తొలివిడత పొగాకు కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో 68.41 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పెట్టుబడులు పెరగడంతో ఈ సారి కిలో సగటు ధర రూ.160 ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల డిమాండ్‌కు తగ్గట్టుగా ధర వస్తుందా?లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వ్యాపారులంతా కుమ్మకై రైతులను నిలువుగా ముంచుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగే కొనుగోళ్ల పైనే రైతులు ఆశలు పెట్టుకొని ఉన్నారు.

కిలో సగటు ధర రూ.160 ఇవ్వాలి

పొగాకు పంట ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో కిలో సగటు ధర రూ.160కి తగ్గకుండా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత గురువారం పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ధర తగ్గకుండా చూడాలని కోరారు. ఇదే విషయాన్ని రైతు ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులను కలిసి తమ డిమాండ్లను కూడా తెలియజేశారు. ఈ ఏడాది తెగుళ్లతో పాటు, ఖర్చులు పెరగడంతో మద్దతు ధర ఇస్తేనే కొంత మేరయినా గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. 1977లో పొగాకు బోర్డు ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, ఎగుమతి దారులు చెప్పిందే ధరగా నడిచేది. లో గ్రేడ్‌ పేరిట ధరలను మరింత తగ్గించేవారు. వారు చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ వచ్చింది. అయితే ఈ సారి ధరలు ఎలా ఉంటాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పొగాకు ఉత్పత్తిలో ప్రకాశం దూకుడు !

పొగాకు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పొగాకు శాతాన్ని పరిశీలిస్తే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 65 శాతం పొగాకు ఉత్పత్తి అవుతోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ఒంగోలు పొగాకు బోర్డు రీజియన్‌ పరిధిలో మొత్తం 13వేలం కేంద్రాలు ఉండగా, అందులో ఒంగోలు 1,2, వెల్లంపల్లి 1,2, టంగుటూరు 1,2, కొండెపి, కందుకూరు1,2, పొదిలి 1,2, డీసీపల్లి, కలిగిరి బోర్డు వేలం కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఒక్క చీరాల మినహా అన్ని ప్రాంతాల్లో రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement