అమరావతి, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు త్వరలో ముగియనున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు విద్యా కానుక కింద ప్రభుత్వం అందజేసే సకల సదుపాయాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. విద్యార్ధులకు అందించే పాఠ్య పుస్తకాల ముద్రణ, సూల్ బ్యాగులు, యూనిఫాంలలో ఎక్కడా నాణ్యతకు లోటు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తొలుత పాఠ్య పుస్తకాల ప్రింటింగ్‌లను దగ్గరుండి పరిశీలించారు. పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్‌లు ఇప్పటికే 82 శాతం ప్రచురణ పూర్తయి మండల స్టాకు పాయింట్లకు చేరాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1నుండి 10 వరకూ మొత్తం 70 లక్షల 42వేల 12 మంది విద్యార్ధులను ఎన్రోల్ చేయగా వారిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 36 లక్షల 54 వేల 539 మంది విద్యార్ధులను ఎన్రోల్ చేశారు.
ఈ విద్యా సంవత్సరంలో 1నుండి 10 వరకూ బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను విద్యార్ధులకు అందించనున్నారు. ఈ యేడాది కొన్ని తరగతుల టెక్ట్స్ బుక్స్ పరిచయ పేజీలో మారనున్నాయి. ఇక విద్యార్ధుల స్కూల్ బ్యాగుల నాణ్యతపై ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యే దృష్టి పెట్టారు. నోయిడాలోని ఓ కంపెనీలో తయారవుతున్న బ్యాగులను ఆయన దగ్గరుండి పరిశీలించారు.
బ్యాగుల తయారీ పూర్తి కావడంతో వాటిని ఏపీకి తరలించే పనిలో నమగ్నమయ్యారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కాగా రెండు రోజులు ముందుగా అంటే 10వ తేదీ నాటికి వీటికి విద్యార్ధులకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు సీఎస్ జవహర్ రెడ్డి సైతం 10వ తేదీ నాటికి విద్యా కానుకలను విద్యార్దులందరికీ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మండల కేంద్రాలకు స్కూల్ బ్యాగులు
నోయిడాలో తయారవుతున్న స్కూల్ బ్యాగులను అధికారులు రాష్ట్రానికి చేరవేసే పనిలో ఉన్నారు. నోయిడాలో బ్యాగులను తరలించే వాహనాలను ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని మండల కేంద్రాలకు స్కూల్ బ్యాగ్‌లను సకాలంలో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.
దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో ఆంక్షలు ఉండటంతో ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా స్కూల్ బ్యాగ్‌లు తయారయ్యే ఫ్యాక్టరీ నుండి ట్రక్కుల ద్వారా రాష్ట్రంలోని మండల కేంద్రాలకు వాటిని తరలించే ప్రక్రియ ను చేపడుతున్నారు.
అంతరాష్ట్రాలను దాటి వచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 250 ట్రక్కుల ద్వారా స్కూల్ బ్యాగ్ లను రాష్ట్రానికి తరలించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. మండల కేంద్రాలను చేరడానికి ఒక్కో ట్రక్ రెండు మూడు రాష్ట్రాలను, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలను దాటి స్టాక్ ను చేర్చాల్సి ఉండటంతో అంతరాష్ట్ర సరిహద్దులను దాటేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రతి ట్రక్కు డ్రైవర్ కు ఒక అండర్ టేకింగ్ ఇచ్చినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.
ప్రతి చెక్ పోస్ట్ లో డ్రైవర్లు అండర్ టేకింగ్ చూపించడం ద్వారా స్టాక్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసి గమ్యస్థానాలను చేర్చేందుకు చర్యలు తీసుకుంటు-న్నామన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ నాణ్యత నియంత్రణ బృందానికి, ప్రతి సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్ధికి అందేలా….
ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు, యూనిఫార్ములు, బ్యాగులు వంటివి సమకూర్చింది ఇంకా సమకూర్చుకోవాల్సిన వాటిపై సమీక్షిస్తూ ప్రతి రోజు ప్రత్యేకంగా మానిటర్ చేసి సకాలంలో అవి మండల స్టాకు పాయింట్లు తద్వారా పాఠశాలల వారిగా విద్యార్ధులకు అందేలా చూడాలని సిఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్ధులకు పాఠ్య, నోటు- పుస్తకాలు, యూనిఫార్మ్‌లు ప్రతి విద్యార్ధికి అందేలా చూడాలన్నారు. అలాగే పాఠశాలల్లో నాడు నేడు కింద చేపట్టిన పనుల ప్రగతిని, మధ్యాహ్న భోజన వసతి తదితర అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.
నాడు నేడు ఫేజ్-2 కింద 7వేల 29 కోట్ల రూ.లతో వివిధ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు,విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, పెయింటింగ్లు, ఆయా పాఠశాలలకు మరమ్మత్తులు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు తరగతుల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయడం జరుగుతోందని మౌలిక సదుపాయాల గురించి కమీషనర్ కె.భాస్కర్ తెలిపారు.
రానున్న విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజన పధకం అమలు సన్నాహక ఏర్పాట్లలోౖ భాగంగా పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, రాగులు, జొన్న వంటివి సమకూర్చుకునేందుకు ఇండెంట్ పెట్టామని గోరుముద్ధ ఆపధకం డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు.అలాగే చిక్కి, కోడి గ్రుడ్లు వంటివి సకాలంలో సమకూర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.