ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 26వ తేదీన ఓట్లు లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. ఓట్లు లెక్కింపు ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కౌంటింగు సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఇక.. ఓట్లు లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి, పార్టీ ఏజెంట్లకు, మీడియా వారికి పాసులు జారీ చేసినట్టు తెలిపారు. ఎవరికైనా సరే పాసులు ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించడం జరుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 20 రౌండ్స్ లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుతో ఓట్లు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్ ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్ చివర్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్స్ ను ప్రత్యేకంగా లెక్కించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మీడియా కవరేజ్ నిమిత్తం ప్రత్యేకంగా మీడియా రూమును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ హాల్లోకి వెళ్లుటకు వేరువేరుగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన బందోబస్తు నడుమ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.