నెల్లూరు, ప్రభ న్యూస్ : కుండపోత వర్షం , చెవులు చిల్లులు పడేటట్లు ఉరుములు .. కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా మెరుపులు .. ఓ వైపు శబ్దం .. మరోవైపు జోరు వాన .. జిల్లా ప్రజల్లో ఏదో తెలియని ఆందోళన. ముఖ్యంగా వరద తాకిడిగి దెబ్బతిన్న డెల్టాలో వణికిపోతున్న ప్రజలు. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ . ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నిన్న నుంచి డిసెంబర్ 2 వరకు నెల్లూరు జిల్లాతో పాటు సరిహద్దు జిల్లా చిత్తూరు లోనూ, జిల్లాను అంతర్‌రాష్ట్ర సరిహద్దుగా కలిగి ఉన్న ఉత్తర తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో 13సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే సూచనలున్నాయని వారు తెలుపుతున్నారు. కాగా, వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలను నిజం చేస్తూ జిల్లాలో నిన్న ఉదయం పసి చినుకులతో ప్రారంభమైన వాన .. రాత్రికల్లా కుండలకు చిల్లులు పడిన రీతిలో జడివానగా మారి రహదారులను జలమయం చేసింది. ఇటీవలే వరదల కారణంగా అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన అధికార యంత్రాంగం భారీ వర్షాల హెచ్చరికలతో మరింత అప్రమత్తమై ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital